IND vs BAN : భార‌త్‌తో టెస్టు సిరీస్‌.. ఆ దిగ్గజ ఆటగాళ్ల సరసన షకీబ్ చేరేనా?

టీమ్ఇండియాతో బంగ్లాదేశ్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది.

IND vs BAN Shakib Al Hasan eyes on all round Test record

IND vs BAN – Shakib Al Hasan : టీమ్ఇండియాతో బంగ్లాదేశ్ రెండు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నుంది. ఈ సిరీస్ సెప్టెంబ‌ర్ 19 నుంచి ప్రారంభం కానుంది. ఈ క్ర‌మంలో బంగ్లాదేశ్ స్టార్ ఆల్‌రౌండ‌ర్ ష‌కీబ్ అల్ హ‌స‌న్ ను ఓ రికార్డు ఊరిస్తోంది. టెస్టు క్రికెట్‌లో 4 వేల ప‌రుగులతో పాటు 250 వికెట్లు తీసిన ఐదో క్రికెట‌ర్‌గా నిలిచే అవ‌కాశం ఉంది. ఈ ఎలైట్ జాబితాలో దిగ్గజ ఆటగాడు ఇయాన్ బోథమ్, కపిల్ దేవ్, జాక్వెస్ కలిస్, డేనియల్ వెటోరీలు మాత్ర‌మే ఉన్నారు.

37 ఏళ్ల ష‌కీబ్ ఈ జాబితాలో చేరేందుకు మ‌రో 8 వికెట్లు మాత్ర‌మే అవ‌స‌రం. ష‌కీబ్ ఇప్ప‌టి వ‌ర‌కు 69 టెస్టులు ఆడాడు. 38.50 స‌గ‌టుతో 4543 ప‌రుగులు చేశాడు. 2.94 ఎకాన‌మీతో 242 వికెట్లు ప‌డ‌గొట్టాడు. స‌హ‌జంగా భార‌త్‌లోని పిచ్‌లు స్పిన్న‌ర్లు అనుకూలంగా ఉంటాయి. ఈ నేప‌థ్యంలో భార‌త బ్యాట‌ర్ల‌కు ష‌కీబ్ నుంచి ముప్పు పొంచి ఉంది అన‌డంలో ఎలాంటి సందేహం లేదు.

Asian Champions Trophy : ఆరోసారి ఆసియా ఛాంపియ‌న్స్ ట్రోఫీ ఫైన‌ల్‌కు చేరిన భార‌త్‌.. సెమీస్‌లో ద‌క్షిణ కొరియా చిత్తు..

అయితే.. ష‌కీబ్ గ‌త కొంత‌కాలంగా బ్యాటింగ్‌లో ఫామ్ లేమీతో ఇబ్బంది ప‌డుతున్నాడు. బౌల‌ర్‌గా సూప‌ర్ ఫామ్‌లో ఉన్నాడు. ష‌కీబ్ బ్యాటింగ్‌ ఫామ్ పై బంగ్లాదేశ్ సెలెక్టర్ హన్నన్ సర్కార్ మాట్లాడుతూ.. షకీబ్ బ్యాటింగ్ ఫామ్ ఆందోళనకరంగా ఉందని, అత‌డు ఫామ్‌లోకి తిరిగి రావడానికి ఇదే స‌రైన స‌మ‌యం అని చెప్పాడు. ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్ మ్యాచుల మ‌ధ్య వ్య‌వ‌ధి చాలా త‌క్కువ‌గా ఉండ‌డంతో స‌మ‌యం ఉండ‌ద‌ని, దీంతో అత‌డు ఫామ్‌లోకి వ‌చ్చేందుకు కొంత స‌మ‌యం ప‌ట్టే అవ‌కాశం ఉంద‌న్నాడు.

భార‌త్‌, బంగ్లాదేశ్ జ‌ట్ల మ‌ధ్య సెప్టెంబ‌ర్ 19 నుంచి తొలి టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. సెప్టెంబ‌ర్ 27 నుంచి కాన్పూర్ వేదిక‌గా రెండో టెస్టు మ్యాచ్ జ‌ర‌గ‌నుంది.

IND vs BAN : ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఊరిస్తున్న ప్ర‌పంచ రికార్డు.. అందుకుంటాడా?