IND vs END: తొలి టెస్టులో ఓటమి తరువాత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన కామెంట్స్.. ఆ రెండు అంశాలే మా ఓటమికి కారణం..

తొలి టెస్టులో ఇంగ్లాండ్ జట్టుపై ఓటమి తరువాత భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ.. ఓటమికి గల కారణాలను వెల్లడించారు.

shubman gill

IND vs END 1st Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఓటమి పాలైంది. భారత్ నిర్దేశించిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది. దీంతో టీమిండియా ఓడిపోయింది. ఓటమి అనంతరం కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మాట్లాడుతూ ఓటమికి గల కారణాలను వెల్లడించారు. ఈ క్రమంలో పలువురు ఆటగాళ్లపై కీలక కామెంట్స్ చేశారు.

Also Read: Ind Vs Eng 1st Test : తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ పరాజయం.. 5 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం

మ్యాచ్ తరువాత గిల్ మాట్లాడుతూ.. ఇది గొప్ప టెస్ట్ మ్యాచ్. ఈ మ్యాచ్‌లో గెలిచేందుకు మాకు అవకాశాలు వచ్చాయి. కానీ, మేము క్యాచ్‌లు వదిలేశాము. దీనికితోడు లోయర్ ఆర్డర్‌లో కూడా పరుగులు రాబట్టలేక పోయాం. మేము రెండో ఇన్నింగ్స్‌లో దాదాపు 430 పరుగులు చేసిన తరువాత ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేయాలని అనుకున్నాం. కానీ, మేము లోయర్ ఆర్డర్‌లో పరుగులు రాబట్టలేకపోయాం. రాబోయే మ్యాచ్ లలో ఈ సమస్యను అధిగమించేలా దృష్టిసారిస్తాం.


ఈ టెస్టులో అనేకసార్లు క్యాచ్‌లు వదిలేశాం. అదికూడా మా జట్టు ఓటమిల్లో ఓ కారణం. అయితే, ఇటువంటి వికెట్లపై అవకాశాలు అంత తేలికగా అందుబాటులో ఉండవు. ఇది యువ జట్టు, నేర్చుకుంటోంది. భవిష్యత్తులో ఈ అంశాలలో మెరుగైన ప్రదర్శన ఉంటుందని ఆశిస్తున్నాను అంటూ శుభ్‌మన్ గిల్ అన్నారు. రెండో టెస్టుకు జస్ర్పీత్ బుమ్రా అందుబాటులో ఉంటాడా అని ప్రశ్నించగా.. మేము మ్యాచ్ ల వారీగా చూస్తాము. రెండో టెస్టుకు ఇంకా సమయం ఉంది. ఆ సమయానికి తగిన నిర్ణయం తీసుకుంటాం అని గిల్ చెప్పారు.

♦ భారత్ తొలి ఇన్నింగ్స్ 471
♦ ఇంగ్లాండ్ తొలి ఇన్నింతగ్స్ 465
♦ భారత్ రెండో ఇన్నింగ్స్ 364
♦ ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ 373