Rishabh Pant: అయ్యో పంత్.. అలా ఎందుకు చేశావ్..! చర్యలకు సిద్ధమైన ఐసీసీ..

మూడోరోజు ఆటలో భాగంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనికి ఐసీసీ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Rishabh Pant

Rishabh Pant: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య లీడ్స్ లోని హెడింగ్లీ వేదికగా తొలి టెస్టు మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో భాగంగా తొలి ఇన్నింగ్స్ లో భారత జట్టు 471 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ జట్టు 465 పరుగులకు ఆలౌట్ అయింది. మూడోరోజు (ఆదివారం) ఆట ముగిసే సమయానికి టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. రాహుల్ (47 బ్యాటింగ్), శుభ్‌మన్ గిల్ (6బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. అయితే, మూడోరోజు ఆటలో భాగంగా వికెట్ కీపర్ రిషబ్ పంత్ చేసిన పనికి ఐసీసీ చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

Also Read: ‘ఎప్పటికీ కృతజ్ఞతతో’.. రోహిత్ శర్మ ఇన్‌స్టా స్టోరీలో ఎమోషనల్ పోస్ట్.. 18ఏళ్ల నాటి ఘటనను గుర్తుచేసుకుంటూ..

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ 61వ ఓవర్లో మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని హ్యారీ బ్రూక్ బౌండరీ కొట్టాడు. ఆ తరువాత బంతి పరిస్థితిపై రిషబ్ పంత్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పరిశీలించాలంటూ బాల్‌ను తీసుకొని అంపైర్ పాల్ రీఫెల్ వద్దకు వెళ్లాడు. పంత్ సూచన మేరకు బాల్ గేజ్ ద్వారా అంపైర్ బాల్‌ను పరీక్షించి అంతా బాగుందని చెప్పాడు. పంత్ మాత్రం అంపైర్ నిర్ణయం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బంతిని గ్రౌండ్ లోకి విసిరి వెళ్లిపోయాడు.

పంత్ ప్రవర్తన పట్ల ఐసీసీ దృష్టిసారించినట్లు తెలుస్తోంది. నిబంధనల ప్రకారం.. అంతర్జాతీయ మ్యాచ్ సమయంలో ఆటగాడిపై, అతని సమీపంలోకానీ, అటగాడి సహాయక సిబ్బందిపై, అంపైర్, మ్యాచ్ రిఫరీ మీద అనుచితమైన, ప్రమాదకరమైన రీతిలో బంతిని లేదా వాటర్ బాటిల్, ఇతర క్రికెట్ పరికరాలను విసిరివేయడం నేరంగా పరిగణించే అవకాశం ఉంటుంది. ఈ నిబంధనల ప్రకారం.. పంత్ ప్రవర్తన పట్ల ఐసీసీ చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.