వన్డే సిరీస్‌లో తొలిసారి ఇంగ్లాండ్ బ్యాటర్లు రాణించారు. కటక్ వేదికగా భారత్‌తో జరుగుతున్న రెండో వన్డేలో బెన్ డకెట్ (65; 56 బంతుల్లో 10 ఫోర్లు), జోరూట్ (69; 72 బంతుల్లో 6 ఫోర్లు) హాఫ్ సెంచరీలతో రాణించారు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ 49.5 ఓవర్లలో 304 పరుగులకు ఆలౌటైంది. లియామ్ లివింగ్ స్టోన్ (41), కెప్టెన్ జోస్ బట్లర్ (34), హ్యారీ బ్రూక్ (31), ఫిలిప్ సాల్ట్ (26)లు ఫర్వాలేదనిపించారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా మూడు వికెట్లు తీశాడు. హర్షిత్ రాణా, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు ఒక్కొ వికెట్ సాధించారు.
వన్డే సిరీస్‌లో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్లు బెన్ డకెట్ ఫిలిప్ సాల్ట్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. సాల్ట్ క్రీజులో నిలదొక్కుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వగా డకెట్ మాత్రం భారత బౌలర్లపైకి ఎదురుదాడికి దిగారు.
IND vs ENG : సచిన్, ధోని, ద్రవిడ్ ఉన్న టీమ్ఇండియా ఎలైట్ ‘కెప్టెన్ క్లబ్’లోకి రోహిత్ శర్మ..
దీంతో 7 ఓవర్లకే స్కోరు 50 పరుగులు దాటేసింది. 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద సాల్ట్ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను అక్షర్ మిస్ చేశాడు. మరికాసేటికే అతడిని అరంగ్రేట బౌలర్ వరుణ్ చక్రవర్తి ఔట్ చేశాడు. దీంతో 81 పరుగుల వద్ద ఇంగ్లాండ్ తొలి వికెట్ కోల్పోయింది.
సాల్ట్ ఔట్ అయిన భారత్‌కు సంతోషించడానికి ఏమీ లేకపోయింది. బెన్ డకెట్‌కు సీనియర్ ఆటగాడు జో రూట్ జతకలిశాడు. డకెట్ వేగంగా ఆడుతూ హాఫ్ సెంచరీ బాదాడు. అదే ఊపులో సెంచరీ దిశగా దూసుకువెలుతున్న అతడిని రవీంద్ర జడేజా ఔట్ చేశాడు. రూట్, డకెట్ జోడి రెండో వికెట్‌కు 21 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.
మరో వైపు రూట్ తనదైన శైలిలో ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. బ్రూక్‌తో మూడో వికెట్‌కు 66 పరుగులు, బట్లర్‌తో నాలుగో వికెట్ కు 51 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. శతకం దిశగా దూసుకువెలుతున్న అతడిని రవీంద్ర జడేజా ఐదో వికెట్ గా పెవిలియన్‌కు చేర్చాడు. ఆఖరిలో లియామ్ లివింగ్ స్టోన్ వేగంగా ఆడడంతో స్కోరు మూడు వందలు దాటింది.