Ind vs Eng 3rd ODI : పోరాడి ఓడిన ఇంగ్లండ్…. వన్డే సిరీస్ కోహ్లీసేన‌దే!

మూడు వన్డేల సిరీస్‌ టీమిండియాను వరించింది. ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి వన్డేలో కోహ్లీసేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 330 విజయ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పోరాడి ఓడింది.

Ind Vs Eng 3rd Odi

మూడు వన్డేల సిరీస్‌ (2-1)తేడాతో టీమిండియాను వరించింది. ఇంగ్లండ్ తో జరిగిన ఆఖరి వన్డేలో కోహ్లీసేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 330 విజయ లక్ష్య ఛేదనలో ఇంగ్లండ్ పోరాడి ఓడింది. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 322 పరుగులకే ఇంగ్లండ్ ఓటమి పాలైంది. ఇంగ్లండ్ ఆటగాడు సామ్ కరన్ వన్ మ్యాన్ షోతో ఆకట్టుకున్నాడు. వికెట్లు పడిపోతున్న చెక్కు చెదరని ఆత్మవిశ్వాసంతో కరన్ (95 నాటౌట్; 83 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులు) దూకుడుగా ఆడుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. కానీ, కరన్ శ్రమ వృథా అయింది.

ఇంగ్లండ్ ఓపెనర్లు జాసన్ రాయ్ (14), బెయిర్ స్టో (1) ఆదిలోనే చేతులేత్తేశారు. ఆ తర్వాత వచ్చిన బెన్ స్టోక్స్ (35) పర్వాలేదనిపించగా… డేవిడ్ మలన్ 50 పరుగులతో హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. మిగతా ఆటగాళ్లలో లివింగ్ స్టోన్ (36) పరుగులు చేయగా బట్లర్ (15), మొయిన్ అలీ (29), అడిల్ రషీద్ (19) పరుగులకే పెవిలియన్ చేరారు. మార్క్ వుడ్ (14) , టోప్లే (1 నాటౌట్)గా ఉన్నాడు. భారత బౌలర్లలో శార్దూల్ థాకూర్ 4 వికెట్లు తీసుకోగా, భువనేశ్వర్ కుమార్ మూడు వికెట్లు, నటరాజన్ ఒక వికెట్ తీసుకున్నాడు. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్ తో ఇంగ్లండ్ ను కట్టడి చేశారు. ఫలితంగా మూడు వన్డేల సిరీస్ 2-1 తేడాతో కోహ్లీసేన సొంతమైంది.

చెలరేగిన ధావన్, పంత్ :
అంతకుముందు టీమిండియా 48.2 ఓవర్లలో 329 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రత్యర్థి జట్టు ఇంగ్లండ్ కు 330 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించింది. తొలుత టాస్ గెలిచిన ఇంగ్లండ్ ఫీల్డింగ్ ఎంచుకోగా.. కోహ్లీసేనను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ (37), శిఖర్ ధావన్ (67) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (7) చేతులేత్తేశాడు. అనంతరం రిషబ్ పంత్ (78) రెచ్చిపోయాడు. పంత్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. హార్దిక్ పాండ్యా కూడా (64) హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భారత ఆటగాళ్లలో ధావన్, పంత్, హార్దిక్ మాత్రమే అత్యధిక స్కోరు చేశారు.

మిగతా ఆటగాళ్లలో కేఎల్ రాహుల్ (7), కృనాల్ పాండ్యా (25), శార్దూల్ ఠాకూర్ (30), భువనేశ్వర్ కుమార్ (3) పరిమితయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో మార్కవ్ వుడ్ మూడు వికెట్లు తీసుకోగా, రషీద్ రెండు వికెట్లు పడగొట్టాడు. స్టోక్స్, మెయిన్ అలీ, లివింగ్ స్టోన్, సామ్ కరణ్, టోప్లీకి తలో వికెట్ దక్కింది. ఇప్పటికే ఈ సిరీస్ లో ఇరుజట్లు తలో మ్యాచ్ గెలిచాయి. ఆఖరి వన్డేలో గెలిచిన భారత్ మూడు వన్డేల సిరీస్ (2-1)తేడాతో కైవసం చేసుకుంది.