Ind vs Eng 3rd Test
Ind vs Eng 3rd Test: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడో టెస్టు మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లాండ్ జట్టు ఆలౌట్ కాగా.. భారత్ జట్టుకూడా 387 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. దీంతో ఇరు జట్ల స్కోర్లు సమం అయ్యాయి. ఇలా జరగడం 2015 తర్వాత ఇదే మొదటి సారికావడం విశేషం.
తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్ జట్టుపై ఆధిక్యం కోసం టీమిండియా గట్టిగానే ప్రయత్నించినా ఆశ నెరవేరలేదు. 145/3తో మూడోరోజు (శనివారం) ఇన్నింగ్స్‌ను కొనసాగించిన టీమిండియాకు.. కేఎల్ రాహుల్ (100), రిషబ్ పంత్ (74) రాణించారు. పంత్ ఔట్ అయిన తరువాత క్రీజులోకి వచ్చిన రవీంద్ర జడేజా (72) విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అయితే, చివరిలో భారత బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టడంతో 387 పరుగుల వద్ద టీమిండియా ఆలౌట్ అయింది.
ఔట్ కాకుండా ఉండేందుకు..
రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టు చివరి ఓవర్లో పెద్ద డ్రామానే ఆడింది. భారత్ తొలి ఇన్నింగ్స్ పూర్తయ్యే సమయానికి మూడోరోజు ఆట ముగింపు దశకు చేరింది. కొద్దిసేపు మాత్రమే సమయం ఉండటంతో రెండుమూడు ఓవర్లు కొనసాగే అవకాశం ఉంది. ఇంగ్లాండ్ ఓపెనర్లు క్రాలీ, డకెట్ క్రీజులోకి వచ్చారు. కనీసం ఒక్క వికెట్ అయినా తీయాలని టీమిండియా భావించింది. ఈ క్రమంలో మొదటి ఓవర్ బుమ్రా వేయగా.. క్రాలీ టైం వృథా చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశాడు.
పలుసార్లు బుమ్రా బంతి వేసేందుకు వేగంగా వస్తున్న సమయంలో క్రాలీ వికెట్ల నుంచి పక్కకు వెళ్లిపోయి చిరాకు తెప్పించాడు. మరోసారి బంతి చేయికి తగిలిందనే సాకుతో కొంతసేపు టైం వృథా చేశాడు. ఈ క్రమంలో భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు చిర్రెత్తుకొచ్చింది. క్రాలీ వద్దకు దూసుకెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘కొంచెం ధైర్యం పెంచుకోండి.. అంటూ ఎగతాళి చేశాడు. దీంతో వారిద్దరి మధ్య ఘర్షణ తీవ్రమవుతున్న సమయంలో మరో బ్యాటర్ డకెట్ అడ్డుకున్నాడు. గిల్‌కు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు.
మొత్తానికి అనుకున్న ప్రకారం.. కేవలం ఒక్క ఓవర్ మాత్రమే పడేలా ఇంగ్లాండ్ బ్యాటర్లు డ్రామా ఆడారు. టీమిండియా బౌలర్ మహమ్మద్ సిరాజ్‌తో మరికొందరు ప్లేయర్లు ఇంగ్లాండ్ బ్యాటర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
FULL HIGHLIGHTS OF THE DRAMATIC END FOR DAY 3 😂🔥 pic.twitter.com/ICLqAsgEEL
— Johns. (@CricCrazyJohns) July 12, 2025