ఎనిమిది రోజుల విరామం తర్వాత అసలైన యాక్షన్ మళ్లీ మొదలుకాబోతోంది. హెడ్డింగ్లీ కార్నెగీలో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన టీమిండియా.. ఇప్పుడు సిరీస్‌లో నిలవాలంటే ఎడ్జ్‌బాస్టన్‌లో జరగబోయే రెండో టెస్టులో తప్పక గెలవాలి. అభిమానులను ఒకే ఒక్క ప్రశ్న వేధిస్తోంది. అదే “ఇంగ్లండ్ వాతావరణం సహకరిస్తుందా?” అన్న ప్రశ్న.
జస్‌ప్రీత్ బుమ్రా ఆడతాడో లేదో అనే టెన్షన్ కంటే, వర్షం మ్యాచ్‌ను పాడుచేస్తుందేమోనన్న భయం ఎక్కువగా ఉంది. అసలు మ్యాచ్ సజావుగా సాగుతుందా? లేక వర్షం మళ్లీ విలన్‌గా మారుతుందా? వాతావరణ పరిస్థితి ఎలా ఉందో చూద్దాం..
గుడ్ న్యూస్.. కానీ ఒక కండిషన్!
క్రికెట్ అభిమానులకు ఇది నిజంగా శుభవార్త. తొలి టెస్టులాగే, రెండో టెస్టు మొదటి రోజు కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు చాలా తక్కువ. కానీ, అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఇంగ్లండ్ వాతావరణాన్ని ఎప్పుడూ పూర్తిగా నమ్మలేం.
Accuweather నివేదిక ప్రకారం.. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం పడే అవకాశం కేవలం 1% మాత్రమే. రోజంతా ఆకాశం మేఘాలతో కప్పి ఉంటుంది. సూర్యరశ్మి పెద్దగా ఉండదు.
ఆకాశం మేఘాలతో నిండి ఉంటే, అది పేస్ బౌలర్లకు లాభం. బంతి గాలిలో బాగా స్వింగ్ అవుతుంది. బ్యాట్స్‌మెన్‌కు ఇది ఒక పెద్ద సవాలు. ఇలాంటి పరిస్థితుల్లో టాస్ గెలిచిన కెప్టెన్ మరో ఆలోచన లేకుండా ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
మొత్తం మీద చూస్తే, రెండో టెస్టు మొదటి రోజు ఆటకు వర్షం వల్ల ఎలాంటి ఆటంకం ఉండదు. అభిమానులు పూర్తి రోజు ఆటను ఆస్వాదించవచ్చు.
అయితే, మేఘావృత వాతావరణం కారణంగా ఇరు జట్ల బ్యాట్స్‌మెన్‌కు అసలైన అగ్నిపరీక్ష ఎదురుకానుంది. కాబట్టి, సవాలుతో కూడిన టెస్ట్ మ్యాచ్‌ను చూసేందుకు సిద్ధంగా ఉండండి..