IND vs NZ: న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో ఆ ఇద్దరు ఆట‌గాళ్ల‌పై వేటు తప్పదా.. వాళ్లెవరంటే..

భారత్ వర్సెస్ న్యూజిలాండ్ మధ్య రెండో టెస్టులో న్యూజిలాండ్ గెలిచినా.. డ్రా చేసినా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడంలో భారత్ జట్టుకు పెద్ద సమస్యే. అందువల్ల వచ్చే రెండు టెస్టు మ్యాచ్‌లు భారత్‌ జట్టుకు చాలా కీలకం.

IND vs NZ 2nd Test

IND vs NZ 2nd Test : టీమిండియాకు న్యూజిలాండ్ జట్టు బిగ్ షాక్ ఇచ్చింది. స్వదేశంలో ఇరు జట్ల మధ్య మూడు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ బెంగళూరు వేదికగా జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో టీమిండియా ఘోర ఓటమిని ఎదుర్కొంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో భారత్ జట్టు విఫలమైంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్ జట్టుతో జరిగే రెండో టెస్టులో భారత్ జట్టులో కీలక మార్పులు చేసేందుకు గంభీర్, రోహిత్ శర్మ సిద్ధమైనట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇద్దరు ఆటగాళ్లను పక్కన పెడతారని సమాచారం.

Also Read: Cheteshwar Pujara : శ‌త‌కంతో చెల‌రేగిన పుజారా.. బ్రియాన్ లారా రికార్డు బ‌ద్ద‌లు.. రీఎంట్రీ ఇచ్చేనా?

ఈనెల 24 నుంచి 28 వరకు పుణె వేదికగా ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిచినా.. డ్రా చేసినా ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరుకోవడంలో భారత్ జట్టుకు పెద్ద సమస్యే. అందువల్ల వచ్చే రెండు టెస్టు మ్యాచ్‌లు భారత్‌ జట్టుకు చాలా కీలకం. ఈనేపథ్యంలో విదేశీ పేస్ పిచ్ లపై రాణించినట్లు స్వదేశీ వికెట్లపై సత్తా చాటలేకపోతున్న మహ్మద్ సిరాజ్ పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తోంది. కివీస్ తో తొలి టెస్టులో సిరాజ్ రెండు వికెట్లు మాత్రమే తీశాడు. రెండో టెస్టులో ఇద్దరు పేసర్లకే పరిమితమవ్వాలని భావిస్తే బుమ్రాకు తోడుగా సిరాజ్ స్థానంలో ఆకాశ్ ను తుది జట్టులో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ముగ్గురు పేసర్లను తీసుకుంటే సిరాజ్ కూడా తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. మరోవైపు మెడ నొప్పితో తొలి టెస్టుకు దూరమైన యువ బ్యాటర్ శుభమన్ గిల్ రెండో టెస్టు తుది జట్టులో చేరే అవకాశం ఉంది. రోహిత్ శర్మ రెండు రోజుల క్రితం మాట్లాడుతూ.. గిల్ ఆరోగ్యంగానే ఉన్నాడని చెప్పాడు.

Also Read: BAN vs SA : చ‌రిత్ర సృష్టించిన క‌గిసో రబాడ.. ప్ర‌పంచ రికార్డు బ్రేక్‌..

రెండో టెస్టు మ్యాచ్ లో కేఎల్ రాహుల్ పై వేటు తప్పదన్న వార్తలు వినిపిస్తున్నాయి. పరుగులు రాబట్టడంలో రాహుల్ విఫలమవుతున్నాడు. కివీస్ తో జరిగిన తొలి టెస్టు లో తక్కువ పరుగులకే పెవిలియన్ బాటపట్టాడు. రాహుల్ స్థానంలో అక్షర్ పటేల్ ను తుది జట్టులోకి తీసుకొనే అవకాశాలు లేకపోలేదు. అక్షర్ పటేల్ జట్టులోకి వస్తే బౌలింగ్ తో పాటు, బ్యాటింగ్ లోనూ రాణించగలడు. ఒకవేళ రెండో టెస్టు తది జట్టులో అక్షర్ పటేల్ చేరితే.. రాహుల్ తో పాటు కుల్దీప్ యాదవ్ పైనా వేటుపడే పరిస్థితి ఉంది. మరోవైపు.. పంత్ ను రెండో టెస్టుకు దూరంగా ఉంచే అవకాశాలున్నాయి. తొలి టెస్టులో పంత్ గాయంతో కీపింగ్ నుంచి పక్కకు తప్పుకున్నాడు. కేవలం బ్యాటింగ్ కు మాత్రమే క్రీజులోకి వచ్చి భారీ స్కోర్ ను రాబట్టాడు. అయితే, గాయం కారణంగా పంత్ కు విశ్రాంతి ఇచ్చేందుకే గంభీర్, రోహిత్ లు మొగ్గు చూపుతున్నారట.