Ravi Shastri : 20లో ఆ రెండు 300 కొడుతాయ్.. టీ20 ప్రపంచకప్ ముందు రవిశాస్త్రి కామెంట్స్..
టీ20 ప్రపంచకప్ పై టీమ్ఇండియా మాజీ కోచ్ రవిశాస్త్రి (Ravi Shastri) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
Ravi Shastri makes bold claim around team India ahead of T20 World Cup 2026
Ravi Shastri : టీ20 ప్రపంచకప్ 2026కి సమయం దగ్గర పడింది. ఫిబ్రవరి 7 నుంచి ఈ మెగాటోర్నీ ప్రారంభం కానుంది. భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఈ మెగాటోర్నీకి ఆతిథ్యం ఇవ్వనున్నాయి. మొత్తం 20 జట్లు ఈ టోర్నీలో కప్పు కోసం పోటీపడనున్నాయి. కాగా.. ఈ 20 జట్లను ఐదేసి జట్ల చొప్పున నాలుగు గ్రూప్‌లు విభజించారు. ఇప్పటికే ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్ ను ఐసీసీ విడుదల చేసింది.
డిఫెండింగ్ ఛాంపియన్‌గా మెగాటోర్నీలో అడుగుపెడుతున్న భారత్ ఫిబ్రవరి 7న తొలి మ్యాచ్ ఆడనుంది. యూఎస్ఏతో తలపడనుంది. సొంత గడ్డపై ఆడనుండడం కూడా భారత్‌కు బాగా కలిసి వస్తుందని, ముచ్చటగా మూడోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఇదిలా ఉంటే.. ఇటీవల కాలంలో బ్యాటర్లు దూకుడుగా ఆడుతుండడంతో ఈ మెగాటోర్నీలో 300 పరుగుల స్కోరును చూసే అవకాశం ఉండొచ్చునని టీమ్ఇండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. 20 జట్లలో ఓ రెండు జట్లు మాత్రం తప్పకుండా 300 స్కోరును అందుకునే ఛాన్స్ ఉందన్నాడు. ఆ రెండు జట్లు భారత్, ఆస్ట్రేలియా అని చెప్పాడు.
‘భారత్, ఆస్ట్రేలియా జట్లకు 300 పరుగుల మార్కును దాటగల సత్తా ఉంది. ఈ రెండు జట్లలోనూ విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నారు. టాప్ ఆర్డర్లో ఓ ప్లేయర్ సెంచరీ సాధిస్తే.. అప్పుడు 300 స్కోరును చేరుకోవడం పెద్ద కష్టం కాదు.’ అని రవిశాస్త్రి అన్నాడు.
ఇక డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగుతున్న భారత్ పై చాలా ఒత్తిడి ఉంటుందన్నాడు. పైగా సొంత గడ్డపై ఆడుతుండడం కూడా అదనపు ఒత్తిడిని తీసుకువస్తుంది. అయితే.. ఆ ఒత్తిడిని భారత ఆటగాళ్లు అధిగమిస్తారని, సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ ను ముద్దాడుతారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు.
