IND vs SA 5th T20 Aiden Markram comments after South africa lost match to India
IND vs SA : అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా జట్టు 30 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమి పై సౌతాఫ్రికా కెప్టెన్ ఐడెన్ మార్‌క్రమ్ స్పందించాడు. లక్ష్య ఛేదనలో మిడిల్ ఆర్డర్ వైఫల్యం వల్లే తాము ఈ మ్యాచ్‌లో ఓడిపోయినట్లుగా చెప్పుకొచ్చాడు.
‘ఓటమిని తట్టుకోవడం కొంచెం కష్టమే. అయితే.. 230 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేటప్పుడు బ్యాటర్లు సమిష్టిగా రాణించాలి. క్వింటన్ డికాక్‌తో పాటు టాప్-3 బ్యాటర్లు చాలా బాగా ఆడారు. ఆ తరువాత మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు అదే ఊపును కొనసాగించలేకపోయారు. దీంతో లక్ష్య ఛేదనలో వెనుకబడి పోయాము.’ అని మార్‌క్రమ్ అన్నాడు.
ఇక ఈ ఓటమి నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నట్లు చెప్పుకొచ్చాడు. వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ భారత్ వేదికగానే జరగనుంది. దీనిపై మార్‌క్రమ్ స్పందిస్తూ.. ప్రపంచకప్‌లో ఇక్కడే చాలా మ్యాచ్‌లు ఆడాల్సి ఉందని, ఈ సిరీస్ వల్ల ఇక్కడి పిచ్‌లు, వాతావరణం పై ఓ అవగాహన వచ్చిందన్నాడు.
Sanju Samson : సంజూ శాంసన్ అరుదైన ఘనత.. 10 ఏళ్లు పట్టింది.. ఏడాదికి ఓ వంద..
డెవాల్డ్ బ్రెవిస్ స్పిన్ బౌలింగ్‌లో హిట్టింగ్ ఆడతాడు, సునాయాసనంగా బంతులను బౌండరీలకు తరలించగలడు. అతడు నైపుణ్యాలను పరీక్షించాలని అనుకున్నాం. అందుకనే అతడికి బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ ఇచ్చినట్లుగా వివరించాడు. ఇక టీ20 క్రికెట్‌లో ఎప్పుడూ కూడా ఒకే రకమైన బ్యాటింగ్ ఆర్డర్ అంటూ ఉండదన్నాడు. మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయన్నాడు. ఈ మ్యాచ్‌లో తాము అదే చేశామన్నాడు.
టీ20 ప్రపంచకప్‌కు ముందు తాము కఠినమైన సవాళ్లను ఎదుర్కొన్నామని తెలిపాడు. ఇదంతా తమకు కలిసి వస్తుందన్నాడు. భారత్ వంటి నాణ్యమైన జట్టుతో ఆడడంతో ప్రపంచకప్‌ను ఎలా గెలవాలనే విషయం పై ఓ అవగాహన వచ్చిందన్నాడు. టీ20 ప్రపంచకప్‌లో తమ జట్టుపై ఈ సిరీస్‌తో ఓ అంచనాకు వచ్చామన్నాడు. సిరీస్ ఓటమి గురించి పట్టించుకోమని, తమ ఏకైక లక్ష్యం టీ20 ప్రపంచకప్‌ను సాధించడమేనని మార్‌క్రమ్ తెలిపాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో తిలక్ వర్మ (73; 42 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ పాండ్యా (63;25 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లు) హాఫ్ సెంచరీలు చేశారు. సఫారీ బౌలర్లలో కార్బిన్ బోష్ రెండు వికెట్లు తీశాడు. ఒట్నీల్ బార్ట్‌మాన్, జార్జ్ లిండే లు తలా ఓ వికెట్ తీశారు.
ఆ తరువాత 232 పరుగుల భారీ లక్ష్య ఛేధనలో దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 201 పరుగులకే పరిమితమైంది. దీంతో భారత్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 3-1తో కైవసం చేసుకుంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (65; 35 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు) హాఫ్ సెంచరీ చేశాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి నాలుగు, జస్‌ప్రీత్ బుమ్రా రెండు, అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్యాలు చెరో ఓ వికెట్ తీశారు.