SA vs IND T20 WC : విశ్వవిజేతగా భారత్.. 17ఏళ్ల నిరీక్షణ తర్వాత ట్రోఫీ సొంతం!

IND vs SA : దక్షిణాఫ్రికాతో జరిగిన తుదిపోరులో భారత్ 7 పరుగుల తేడాతో గెలిచి ప్రపంచ ఛాంపియన్‌‌గా అవతరించింది.

SA vs IND T20 WC : ఎట్టకేలకు టీమిండియా 17ఏళ్ల నిరీక్షణ నేటితో ముగిసింది. ప్రపంచ కప్ టోర్నీలో భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఎంఎస్ ధోని సారథ్యంలో చివరిసారిగా భారత్‌కు ఐసీసీ ట్రోఫీని అందించిన 17 ఏళ్ల తర్వాత రోహిత్ సేన రెండోసారి టీ20 ప్రపంచ కప్ ట్రోఫీని ముద్దాడింది.

దక్షిణాఫ్రికాతో ఉత్కంఠభరింతగా జరిగిన తుదిపోరులో భారత్ సఫారీలను చిత్తుగా ఓడించి 7 పరుగుల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. భారత్ నిర్దేశించిన 177 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో సఫారీలు విఫలమయ్యారు. భారత్ ఫాస్ట్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా (18/2), హార్దిక్ పాండ్యా (20/3), అర్ష్‌దీప్ సింగ్ (20/2) విజృంభించి దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించారు.

చివరి ఓవర్‌లో 16 పరుగులను విజయవంతంగా డిఫెండ్ చేసిన హార్దిక్ పాండ్యా సఫారీల వికెట్లను నెలరాల్చాడు. దాంతో రోహిత్ శర్మ తన కెప్టెన్సీలో ప్రపంచ కప్ ట్రోఫీని అందుకున్నాడు. భారత బౌలర్లు చెలరేగి ఆడటంతో దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టేశారు. పదునైన బంతులతో సఫారీలను చిత్తుచేశారు. వరుసగా వికెట్లను పడగొడుతూ మ్యాచ్‌పై పట్టుబిగించారు.

ఫలితంగా 7 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి ప్రపంచ ఛాంపియన్లుగా అవతరించారు. ఒక దశలో దక్షిణాఫ్రికా విజయం దాదాపు ఖాయమే అన్నట్టుగా సాగింది. చివరి 5 ఓవర్లు ఆట మలుపు తిప్పారు భారత బౌలర్లు. అనూహ్యంగా పుంజుకుని సఫారీలకు చుక్కలు చూపించారు. దాంతో సౌతాఫ్రికా గెలుపునకు 7 పరుగుల దూరంలో నిలిచిపోయారు.

కోహ్లీ విజృంభణ.. 
అంతకుముందు టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న రోహిత్ సేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు సాధించింది. విరాట్ కోహ్లీ (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్) అత్యధిక పరుగులు చేయగా, అక్షర్ పటేల్ (47)తో అద్భుతంగా రాణించాడు. శివమ్ దూబే (27), కెప్టెన్ రోహిత్ శర్మ (9), రవీంద్ర జడేజా (2), హార్దిక్ పాండ్యా (5) పరుగులు చేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, ఎన్రిక్ నోర్కియా తలో 2 వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్, కగిసో రబడా తలో వికెట్ తీసుకున్నారు.

Read Also : T20 World Cup Final : జయహో భారత్.. ప్రపంచ ఛాంపియన్ రోహిత్ సేనకు అభినందనల వెల్లువ..

ట్రెండింగ్ వార్తలు