IND vs SL 3rd T20I : సిరీస్ క్లీన్‌స్వీప్.. సూపర్ ఓవర్‌‌లో టీమిండియా విజయం..!

IND vs SL 3rd T20I : మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సూపర్ ఓవర్ ఆడి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. ఫలితంగా 3-0తో భారత్ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేసింది.

IND vs SL 3rd T20I _ Team India wins the super-over match ( Image Source : Google )

IND vs SL 3rd T20I : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను టీమిండియా క్లీన్ స్వీప్ చేసింది. తొలి రెండు టీ20 మ్యాచ్‌ల్లో గెలిచి సిరీస్ కైవసం చేసుకున్న భారత్ ముచ్చటగా మూడో మ్యాచ్‌లో కూడా శ్రీలంకపై విజయం సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 137 పరుగుల చేసిన టీమిండియా ప్రత్యర్థి జట్టు లంకకు 138 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.

టీమిండియా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించడంలో లంక ఆటగాళ్లు ధీటుగా ఆడి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేయడంతో మ్యాచ్ టైమ్ అయింది. దాంతో అంపైర్లు సూపర్ ఓవర్ ఆడించారు.

ఇరుజట్లు తలో ఒక ఓవర్ ఆడగా.. ముందుగా లంక బ్యాటింగ్ చేసి కేవలం మూడు బంతుల్లో 2 పరుగులకే 2 వికెట్లను కోల్పోయింది. కుసాల్ మెండిస్ ఒక పరుగు తీయగా, కుశాల్ పెరీరా, పాతుమ్ నిస్సాంక పరుగులేమి తీయకుండానే పెవిలియన్ చేరుకున్నారు.

వాషింగ్టన్ సుందర్ ఏకంగా రెండు వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ సూపర్ ఓవర్ ఆడి ఇంకా 5 బంతులు మిగిలి ఉండగానే గెలిచింది. సూర్య కుమార్ మొదటి బంతికే ఫోర్ కొట్టడంతో విజయం అనివార్యమైంది. ఫలితంగా 3-0తో భారత్ లంకను క్లీన్ స్వీప్ చేసింది.

రాణించిన మెండిస్, పెరీరా :
టీమిండియా నిర్దేశించిన 137 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన శ్రీలంక ఓపెనర్ పాతుమ్ నిస్సాంక (26), కుసాల్ మెండిస్ (48), కుశాల్ పెరీరా (46) రాణించగా, వానిందు హసరంగా (3), రమేష్ మెండిస్ (3), కమిందు మెండిస్ (1), అసిత ఫెర్నాండో (1), చవిందు విక్రమసింఘే (4) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.

శుభమన్ గిల్ అత్యధిక స్కోరు :
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేపట్టిన టీమిండియా ఆదిలోనే తడబడ్డారు. భారత ఓపెనర్ యశస్వి జైస్వాల్ (10)కే పరిమితం కాగా, శుభమాన్ గిల్ (39), రియాన్ పరాగ్ (26), వాషింగ్టన్ సుందర్ (25) పరుగులతో రాణించారు. రవి బిష్ణోయ్ (8 నాటౌట్), సూర్య కుమార్ యాదవ్ (8) సింగిల్ డిజిట్‌కు పరిమితమయ్యారు. లంక బౌలర్లలో మహేశ్ తీక్షణ ఏకంగా 3 వికెట్లు పడగొట్టగా, వానిందు హసరంగా 2 వికెట్లు, అసిత ఫెర్నాండో, రమేష్ మెండిస్ తలో వికెట్ తీసుకున్నారు.

Read Also : TNPL 2024 : స్టేడియం బయటకు సిక్స్.. బంతి ఇచ్చేది లేదు.. ఏం చేసుకుంటారో చేసుకోండి.. స్థానికుడు ఆగ్రహం!

ట్రెండింగ్ వార్తలు