IND vs UAE India Break Asian Record After Chasing Down Target In Just 27 Balls
Team India : ఆసియాకప్ 2025లో భారత్ అద్భుత విజయాన్ని సాధించింది. దుబాయ్ వేదికగా యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని సాధించింది. యూఏఈ నిర్ధేశించిన 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని భారత్ (Team India) కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 4.3 ఓవర్లలోనే అందుకుంది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన యూఏఈ 13.1 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. టీమ్ఇండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు, శివమ్ దూబే మూడు వికెట్లు తీశాడు. ఆ తరువాత అభిషేక్ శర్మ(30 పరుగులు 16 బంతుల్లో) శుభ్‌మన్ గిల్(20 నాటౌట్ 9 బంతుల్లో) దూకుడుగా ఆడడంతో 4.3 ఓవర్లలో (27 బంతుల్లోనే) భారత్ లక్ష్యాన్ని అందుకుంది. ఈ క్రమంలో పలు రికార్డులను భారత్ సొంతం చేసుకుంది.
ఆసియాకప్ టీ20 టోర్నీలో బంతులు పరంగా భారీ విజయం సాధించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. యూఏఈతో మ్యాచ్‌లో భారత్ 93 బంతులు మిగిలుండగానే లక్ష్యాన్ని అందుకుంది. అంతకముందు ఈ రికార్డు అఫ్గాన్ పేరిట ఉంది. ఆసియాకప్ 2022లో దుబాయ్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక పై 59 బంతులు మిగిలి ఉండగానే అఫ్గాన్ విజయాన్ని అందుకుంది.
ఇక ఓవరాల్‌గా అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) లక్ష్యాన్ని ఛేదించిన రెండో జట్టుగా భారత్ నిలిచింది. ఈ జాబితాలో ఇంగ్లాండ్ అగ్రస్థానంలో ఉంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ 3.1 ఓవర్లలో ఒమన్ పై విజయాన్ని అందుకుంది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత వేగంగా (బంతుల పరంగా) విజయాన్ని అందుకున్న జట్లు ఇవే..
* ఇంగ్లాండ్ – 101 బంతులు మిగిలి ఉండగా (2024లో ఒమన్‌పై)
* భారత్ – 93 బంతులు మిగిలి ఉండగా (2025లో యూఏఈ పై)
* శ్రీలంక – 90 బంతులు మిగిలి ఉండగా (2014లో నెదర్లాండ్స్ పై)
* జింబాబ్వే – 90 బంతులు మిగిలి ఉండగా (2024లో మొజాంబిక్ పై)
టీ20ల్లో భారత్ పై అత్యల్ప పరుగులకే ఆలౌటైన జట్లు ఏవంటే..?
అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత జట్టు చేతిలో అత్యల్ప పరుగులకే ఆలౌటైన జట్టుగా యూఏఈ నిలిచింది. ఈ తరువాతి స్థానాల్లో న్యూజిలాండ్, ఐర్లాండ్, ఇంగ్లాండ్ లు ఉన్నాయి.
టీ20ల్లో భారత్ పై అత్యల్ప పరుగులు చేసిన జట్లు ఇవే..
* యూఏఈ – 57 పరుగులు (2025లో)
* న్యూజిలాండ్ – 66 పరుగులు (2023లో)
* ఐర్లాండ్ – 70 పరుగులు (2018లో)
* కొలంబో – 80 పరుగులు (2012లో)