ODI rankings : మొద‌టి ర్యాంకుతో వన్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో అడుగుపెడుతున్న సిరాజ్‌.. ఒక్క‌డే కాదు..

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023కి ఒక్క రోజు ముందు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌న్డే ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసింది.

Siraj-Hazlewood

ICC ODI rankings : క్రికెట్ ప్రేమికులు ఎంత‌గానో ఎదురుచూస్తున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ 2023 గురువారం నుంచి ఆరంభం కానుంది. ఈ క్ర‌మంలో ఈ మెగా టోర్నీకి ఒక్క రోజు ముందు అంత‌ర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) వ‌న్డే ర్యాంకింగ్స్‌ను విడుద‌ల చేసింది. బౌల‌ర్ల జాబితాలో భార‌త పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌తో పాటు ఆస్ట్రేలియా పేస‌ర్ జోష్ హేజిల్ వుడ్ మొద‌టి స్థానంలో నిలిచారు. ఇటీవ‌ల ముగిసిన భార‌త్, ఆస్ట్రేలియా సిరీస్‌లోని మూడవ వ‌న్డేలో సిరాజ్ ధారాళంగా ప‌రుగులు స‌మ‌ర్పించుకోవ‌డంతో 11 రేటింగ్ పాయింట్లు కోల్పోయాడు.

సిరాజ్ త‌న అగ్ర‌స్థానాన్ని నిలుపుకున్న‌ప్ప‌టికీ రేటింగ్ పాయింట్లు కోల్పోవ‌డంతో ఆసీస్ పేస‌ర్‌తో పంచుకోవాల్సి వ‌చ్చింది. వీరిద్ద‌రి ఖాతాలో ప్ర‌స్తుతం 669 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. వీరిద్ద‌రి త‌రువాత ఆఫ్గానిస్తాన్ బౌల‌ర్లు ముజీబ్ ఉర్ రెహ్మాన్ (657 రేటింగ్ పాయింట్లు) ర‌షీద్ ఖాన్ (655 రేటింగ్ పాయింట్ల‌తో) వ‌రుస‌గా మూడు, నాలుగు స్థానాల్లో కొన‌సాగుతున్నారు. పాకిస్తాన్ స్టార్ పేస‌ర్‌ షాహీన్ అఫ్రిది (632 రేటింగ్ పాయింట్లు) రెండు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకోగా.. మిచెల్ స్టార్క్ (628 రేటింగ్ పాయింట్లు) రెండు స్థానాలు దిగ‌జారి ఎనిమిదో స్థానానికి ప‌డిపోయాడు. సిరాజ్ మిన‌హా మ‌రో భార‌త బౌల‌ర్ టాప్‌-10లో లేడు.

బ్యాట‌ర్ల ర్యాంకుల్లో దాదాపుగా మార్పులు లేవు..

వ‌న్డే బ్యాట‌ర్ల ర్యాంకింగ్స్‌లో పెద్ద‌గా మార్పులు లేవు. పాకిస్తాన్ ఆట‌గాడు బాబ‌ర్ ఆజాం (857) అగ్ర‌స్థానంలో కొన‌సాగుతుండ‌గా టీమ్ఇండియా యువ ఓపెన‌ర్ శుభ్ మ‌న్ గిల్ (839) అత‌డిని అనుస‌రిస్తున్నాడు. ద‌క్షిణాఫ్రికా ఆట‌గాడు డ‌స్సెన్ (743) మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. టీమ్ఇండియాతో సిరీస్‌లో మూడు మ్యాచుల్లో వ‌రుస‌గా అర్థ‌శ‌త‌కాలు బాదిన డేవిడ్ వార్న‌ర్ (729) ఓ స్థానాన్ని మెరుగుప‌ర‌చుకుని ఐర్లాండ్ ఆట‌గాడు హ్యారీ టెక్టర్ తో క‌లిసి నాలుగో స్థానాన్ని పంచుకున్నాడు. టీమ్ఇండియా స్టార్ ఆట‌గాళ్లు విరాట్ కోహ్లీ (696) తొమ్మిది, రోహిత్ శ‌ర్మ (695) ప‌దో స్థానంలోనే కొన‌సాగుతున్నారు.

Asian Games : జావెలిన్ త్రోలో ఒకే రోజు 2 ప‌త‌కాలు.. నీరజ్‌ చోప్రాకు గోల్డ్, కిశోర్‌కు ర‌జ‌తం

ఆల్ రౌండ‌ర్ల విభాగంలో..

ఆల్‌రౌండ‌ర్ల ర్యాంకింగ్స్‌లో సైతం పెద్ద‌గా మార్పులు లేవు. బంగ్లాదేశ్ కెప్టెన్ ష‌కీల్ అల్ అస‌న్ (349) మొద‌టి స్థానంలోనే కొన‌సాగుతున్నాడు. అఫ్గాన్ ఆట‌గాడు మ‌హ్మ‌ద్ న‌బీ (302), జింబాబ్వే ప్లేయ‌ర్ సికింద‌ర్ ర‌జా (287) లు వ‌రుస‌గా రెండు, మూడు స్థానాల్లోనే ఉన్నారు. టీమ్ఇండియా ఆల్‌రౌండ‌ర్ హార్ధిక్ పాండ్య (228) స్థానంలోనూ మార్పు లేదు. అత‌డు ఏడో స్థానంలోనే కొన‌సాగుతున్నాడు.