IND vs ENG T20: ఇంగ్లాండ్‌తో ఐదు టీ20లకు భారత్ జట్టు ప్రకటన.. షమీ, నితీశ్ రెడ్డితో సహా..

IND vs ENG T20: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15మంది సభ్యుల జట్టును ప్రకటించగా..

Mohammed Shami returns as India announce squad for England T20 series

IND vs ENG T20: ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ జట్ల మధ్య స్వదేశంలో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే టీ20 సిరీస్ కు బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. సూర్యకుమార్ యాదవ్ నాయకత్వంలో 15మంది సభ్యుల జట్టును ప్రకటించగా.. సుదీర్ఘ కాలం తరువాత మహ్మద్ షమీ టీమిండియా జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. షమీ తన చివరి టీ20 మ్యాచ్ ను 2022 నవంబర్ లో ఆడాడు. దాదాపు 14నెలలుగా గాయం కారణంగా అంతర్జాతీయ క్రికెట్ కు అతను దూరమయ్యాడు. ఇటీవల షమీ కోలుకొని రంజీల్లో ఆడుతున్నాడు. అయితే, ఆస్ట్రేలియా, ఇండియా మధ్య జరిగిన బోర్డర్ గావస్కర్ ట్రోఫీలోకి షమీ ఎంట్రీ ఇస్తారని అందరూ భావించినప్పటికీ.. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవటంతో సెలెక్టర్లు అతన్ని పరిగణలోకి తీసుకోలేదు.

 

తాజాగా ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ కు షమీని ఎంపిక చేస్తూ సెలక్టర్లు నిర్ణయం తీసుకున్నారు. అయితే, షమీ ఈ సిరీస్ లో అన్ని మ్యాచ్ లు ఆడే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే టీ20 సిరీస్ తరువాత ఇంగ్లండ్ తో భారత్ జట్టు వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ వెంటనే చాంపియన్స్ ట్రోపీ -2025 ప్రారంభమవుతుంది. వన్డేలకు మహ్మద్ షమీ చోటు దక్కించుకునే అవకాశం ఉంది. ఈ క్రమంలో పనిభారాన్ని పరిగణలోకి తీసుకొని మహ్మద్ షమీకి టీ20 సిరీస్ అన్ని మ్యాచ్ ల్లో ఆడే అవకాశం ఉండకపోవచ్చునని బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. షమీ వన్డేల్లో 2023 వన్డే ప్రపంచ కప్ లో భారత తరపున తన చివరి మ్యాచ్ ఆడాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో కనిపించాడు. ఆ తరువాత సర్జరీ కోసం యూకే వెళ్లాడు. ప్రస్తుతం పూర్తి ఫిట్ నెస్ తో దేశవాళీ క్రికెట్ లో బెంగాల్ జట్టు తరపున ఆడుతున్నాడు.

 

మరోవైపు.. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో బ్యాటింగ్ తో ఆకట్టుకున్న ఆల్ రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డికి టీ20 జట్టులో చోటు దక్కింది. అయితే, గతేడాది జులైలో శ్రీలకంతో టీ20 సిరీస్ లో భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహరించిన శుభమన్ గిల్ కు ఇంగ్లండ్ తో జరిగే టీ20 జట్టులో చోటు దక్కలేదు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన జట్టుకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ కాగా.. వైస్ కెప్టెన్ అవకాశం ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు దక్కింది. ఇదిలాఉంటే.. భారత్ చివరగా దక్షిణాఫ్రికాతో ఆడిన టీ20 సిరీస్ లో సభ్యులైన అవేశ్ ఖాన్, యశ్ దయాళ్, రమన్ దీప్ సింగ్, జితేశ్ శర్మలపై వేటు పడింది.

 

టీ20 జట్టు ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), అక్షర్ పటేల్ (వైస్ కెప్టెన్), సంజు శాంసన్, తిలక్ వర్మ, అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్య, రింకు సింగ్, నితీశ్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, అర్ష్ దీప్ సింగ్, మహ్మద్ షమీ, వరున్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాసింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్.

మ్యాచ్‌లు జరిగే తేదీలు, ప్రదేశం..
22న తొలి టీ20 (కోల్ కతా)
25న రెండో టీ20 (చెన్నై)
28న మూడో టీ20 (రాజ్ కోట్)
31న నాల్గో టీ20 (పుణె)
ఫిబ్రవరి 2న ఐదో టీ20 (పుణె)
ఫిబ్రవరి 6 నుంచి ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభమవుతుంది.