India beat South Africa
మూడు మ్యాచుల వన్డే సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. జోహన్నెస్‌బర్గ్ లోని వాండరర్స్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 117 స్వల్ప లక్ష్యాన్ని టీమ్ఇండియా రెండు వికెట్లు కోల్పోయి 16.4 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్), అరంగ్రేట బ్యాటర్ సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధశతకాలతో రాణించారు. రుతురాజ్ గైక్వాడ్ (5) విఫలం అయ్యాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో వియాన్ ముల్డర్, ఫెహ్లుక్వాయో లు చెరో వికెట్ తీశారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకు కుప్పకూలింది. సఫారీ బ్యాటర్లలో ఫెహ్లుక్వాయో (33), టోనీ డి జోర్జి (28), మార్‌క్రమ్ (12), తబ్రైజ్ షమ్సీ (11 నాటౌట్) లు రెండు అంకెల స్కోరు చేశాడు. హెన్రిచ్ క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), కేశవ్ మహరాజ్ (4), నాండ్రే బర్గర్ (7) సింగిల్ డిజిట్‌లకే పరిమితం అయ్యారు. రీజా హెండ్రిక్స్ (0), రాస్సీ వాన్ డెర్ డస్సెన్(0), వియాన్ ముల్డర్ (0) లు డకౌట్లు అయ్యారు.
భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ ఐదు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా అవేశ్ ఖాన్ నాలుగు వికెట్లతో రాణించాడు. కుల్దీప్ యాదవ్ ఓ వికెట్ పడగొట్టాడు. కాగా.. వన్డే క్రికెట్‌లో సౌతాఫ్రికాకు సొంతగడ్డపై ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. 2018లో సఫారీ గడ్డపై 118 పరుగులకు సౌతాఫ్రికా ఆలౌటైంది. అప్పుడు కూడా టీమ్ఇండియా చేతిలోనే కావడం విశేషం. ఓవరాల్‌గా సౌతాఫ్రికాకు ఇది పదో అత్యల్ప స్కోర్. 1993లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో సౌతాఫ్రికా 69 పరుగులకు ఆలౌటైంది. వన్డే క్రికెట్‌లో ఇదే దక్షిణాఫ్రికా జట్టుకు అత్యల్ప స్కోర్.
Also Read : నాథన్ లియోన్ అరుదైన ఘనత.. 500 వికెట్ల క్లబ్‌లో చోటు.. అశ్విన్‌కు కష్టమేనా..!
ఇక ఇరు జట్ల మధ్య డిసెంబర్ 19 మంగళవారం ఓవల్ వేదికగా రెండో వన్డే మ్యాచ్ జరగనుంది.