సిరీస్ ఓడినా.. పరువు నిలిచింది.. ఆస్ట్రేలియాపై భారత్ విజయం

  • Publish Date - December 2, 2020 / 05:58 PM IST

India vs Australia 3rd ODI 2020: భారత్, ఆస్ట్రేలియా జట్లు మధ్య జరిగిన మూడు వన్డేల సిరీస్‍‌లో మూడవదైన చివరి మ్యాచ్‌లో టీమిండియా 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాపై అద్భుత విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకోగా.. నిర్ణత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి భారత జట్టు 302 పరుగులు చేసింది.



అనంతరం 303 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు.. 49.3 ఓవర్లలో 289 పరుగులకే ఆలౌట్ అయింది. ఆస్ట్రేలియా జట్టు ఇప్పటికే మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను రెండు విజయాలతో కైవసం చేసుకోగా.. మూడవ మ్యాచ్‌లో గెలిచి భారత్ పరువు దక్కించుకుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2–1తో గెలుచుకోగా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ హార్దిక్ పాండ్యాకు దక్కింది. కాగా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డును స్టీవ్ స్మిత్‌కు ఇచ్చారు. సిరీస్ అంతటా స్మిత్ అద్భుతంగా రాణించాడు.



ఈ మ్యాచ్‌లో ధావన్ 16పరుగుతు, శుబ్మాన్ గిల్ 33, విరాట్ కోహ్లీ 63, అయ్యర్ 19, హార్దిక్ పాండ్యా 92, రవీంద్ర జడేజా 66 పరుగులు చేసి రాణించారు. పాండ్యా, రవీంద్ర జడేజా చేసిన అద్భుతమైన ఇన్నింగ్స్‌ కారణంగానే భారత్ 303 స్కోరును చేరుకోగలిగింది. విరాట్ తన ఇన్నింగ్స్ సమయంలో 5 ఫోర్లు కొట్టగా.. పాండ్యా 7 ఫోర్లు, ఒక సిక్సర్ కొట్టాడు. అదే సమయంలో జడేజా 5 ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు.



చివరి ఏడు ఓవర్లలో పాండ్యా, జడేజా బ్యాటింగ్ చేసి 93 పరుగులు చేశారు. తరువాత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా జట్టు.. ఫించ్ 82 బంతుల్లో 75 పరుగులు చేయగా.. తన ఇన్నింగ్స్‌లో ఏడు ఫోర్లు, మూడు సిక్సర్లు కొట్టాడు. అదే సమయంలో గ్లెన్ మ్యాక్స్‌వెల్ 38 బంతుల్లో 3 ఫోర్లు, నాలుగు సిక్సర్ల సహాయంతో 59 పరుగులు చేశాడు. మ్యాక్స్‌వెల్ క్రీజులో ఉన్నంతసేపు, ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా విజయం సాధిస్తుందని అనిపించింది. అతను అవుట్ అయిన వెంటనే, వికెట్లు వెంటవెంటనే పడిపోగా.. ఆస్ట్రేలియా 49.3ఓవర్లలో 289పరుగులు మాత్రమే చేయగలిగింది.



శార్దుల్ ఠాకూర్ 3వికెట్లు, బుమ్రా, టి నటరాజన్ చెరో 2వికెట్లు తీశారు. ఇవే కాకుండా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా చెరొక వికెట్ తీసుకున్నారు. తన తొలి మ్యాచ్‌లో టి నటరాజన్ అద్భుతంగా బౌలింగ్ చేయగా.. శార్దూల్ ఠాకూర్ కూడా మ్యాచ్ లో రాణించాడు.