ఆస్ట్రేలియాతో స్వదేశంలో టీ20 సిరీస్ కోల్పోయిన కోహ్లీ సేన వన్డే సిరీస్ కు సిద్ధం అయింది. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా భారత్-ఆస్ట్రేలియా మధ్య ఇవాళ(2 మార్చి 2019న) హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఆసీస్‌తో జరిగిన రెండు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో ఓడిన భారత్.. ఈ మ్యాచ్ లో గెలిచి సత్తా చాటాలని భావిస్తుంది. మరోవైపు ఇప్పటివరకు ఉప్పల్ స్టేడియంలో ఓటిమి ఎరగని ఆస్ట్రేలియా.. టీ20 సిరీస్ ను కూడా గెలిచిన ఊపులో వన్డేలను కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతుంది.
Read Also : టాస్ గెలిచిన ఆస్ట్రేలియా, భారత్ ఫీల్డింగ్
గతంలో ఇక్కడ జరిగిన రెండు మ్యాచుల్లోనూ ఆస్ట్రేలియా విజయం సాధించగా.. 2007లో జరిగిన మ్యాచ్ లో భారత్‌ను 47 పరుగుల తేడాతో ఓడించింది. ఆ తర్వాత రెండేళ్లకు జరిగిన మ్యాచులోనూ భారత్ ఓటమి పాలైంది. ఉప్పల్ స్టేడియంలో మంచి రికార్డు కలిగిన ఆస్ట్రేలియా దానిని కాపాడుకోవాలని భావిస్తుండగా, పుష్కర కాలంగా దక్కని విజయాన్ని అందుకోవాలని కోహ్లీ సేన పట్టుదలగా ఉంది. ఆస్ట్రేలియాలో చివరగా జరిగిన ఏడు వన్డేల్లో భారత్ ఆరు విజయాలను నమోదు చేసింది.
ఇదిలా ఉంటే ప్రపంచకప్ ఆడబోయే జట్టు కూర్పు చేసుకునేందుకు టీమిండియా సెలక్షన్ కమిటీకి ఈ సిరీసే ఆఖరి అవకాశం. అందువల్ల ఈ సిరీస్ కేఎల్ రాహుల్, జడేజా, విజయ్ శంకర్ లకు గట్టి పరిక్ష అని చెప్పవచ్చు. ఈ సిరీస్ లలో సత్తా చాటేవాళ్లే రాబోయే ప్రపంచకప్ లో అవకాశం దక్కించుకునే పరిస్థితి ఉంది. కాగా, భారత గడ్డపై ఆస్ట్రేలియా జట్టు తన పర్యటనల్లో ఇప్పటివరకు 26 మ్యాచ్‌లు గెలిస్తే, భారత్ 25 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. ఐదు మ్యాచుల్లో ఫలితం తేలలేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాత్రం ఆస్ట్రేలియాతో పోలిస్తే టీమిండియా మెరుగైన జట్టుగా ఉంది. వన్డే సిరీస్ లో కూడా కోహ్లీ సేనే హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది.
Read Also : అదుర్స్ : కొత్త జెర్సీలో టీమిండియా