Ind vs NZ Series: ప్రపంచకప్‌లో భారత్ ఫెయిల్.. హార్దిక్ పాండ్యాపై వేటు..! రీప్లేస్‌మెంట్ ఎవరంటే?

భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. పూర్తిగా నిరాశపరిచింది.

Hardhik Pandya

Ind vs NZ Series: భారత క్రికెట్ జట్టు టీ20 ప్రపంచకప్-2021 టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. టైటిల్ ఫెవరెట్‌గా బరిలోకి దిగిన భారత్.. పూర్తిగా నిరాశపరిచింది. పాకిస్తాన్‌తో ఘోరంగా ఓడిపోయిన భారత్.. న్యూజిలాండ్‌తో చేతులెత్తేసింది. తర్వాత పిల్లకూనలపై వీరత్వం చూపి మూడు మ్యాచ్‌లు గెలిచింది. ఈ క్రమంలోనే కోహ్లీసేన ఇంటిదారి పట్టగా.. తర్వాత న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌, శ్రీలంక, ఇంగ్లండ్‌ జట్లతో భారత్ వరుస సిరీస్‌లు ఆడనుంది.

న్యూజిలాండ్‌ జట్టుతో ఈ నెలలోనే ప్రారంభం కాబోతున్న సిరీస్‌కు మరో రెండు రోజుల్లో జట్టును ప్రకటించే అవకాశం ఉండగా.. ప్రపంచకప్-2021లో విఫలమయిన కొందరి ఆటగాళ్లపై వేటు పడే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ సిరీస్‌లో రాణించని హార్ధిక్ పాండ్యాపై వేటు పడే అవకాశం కనిపిస్తుంది. అయితే, ఐపీఎల్‌లో రాణించిన కోల్‌కతా నైట్ రైడర్స్ స్టార్‌ వెంకటేష్ అయ్యర్ జట్టులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది.

ఐదేళ్ల తర్వాత న్యూజిలాండ్‌ జట్టు భారత్‌ పర్యటనకు రానుంది. నవంబరు 17వ తేదీ నుంచి డిసెంబరు 7వ తేదీ వరకు టీ20, టెస్టు సిరీస్‌లు ఆడనుంది. ఈ పర్యటనను భారత్ ప్రతిష్టాత్మకంగా తీసుకోగా.. కొత్త, పాత కలయికతో టీమ్ సెలెక్ట్ చెయ్యాలని భావిస్తుంది సెలెక్షన్ కమిటీ.

న్యూజిలాండ్‌ పర్యటన వివరాలు:
మొదటి టీ20- నవంబరు 17, జైపూర్‌
రెండో టీ20- నవంబరు 19, రాంచి
మూడో టీ20- నవంబరు 21, కోల్‌కతా

మొదటి టెస్టు-నవంబరు 25- 29, కాన్పూర్‌
రెండో టెస్టు-డిసెంబరు 3-7, ముంబై