సొంతగడ్డపై భారత బౌలర్లు విజృంభించారు. సఫారీలను 149 పరుగులకే కట్టడి చేశారు. తొలి టీ20 రద్దు తర్వాత భారీ అంచనాలతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 5 వికెట్లు నష్టపోయి 150 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. ఈ క్రమంలో దీపక్ చాహర్ 2 వికెట్లు పడగొట్టగా, నవదీప్ సైనీ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీయగలిగారు.
3.5వ ఓవర్‌కే హెన్‌డ్రిక్స్(6) తొలి వికెట్ కోల్పోయిన సఫారీలకు డికాక్, బావుమా మంచి స్టాండ్ బై ఇచ్చారు. చాలాసేపటి వరకూ క్రీజులో నిలదొక్కుకుని స్కోరును పరుగులు పెట్టించారు. వీరి జోడీకి నవదీప్ సైనీ బ్రేకులు వేశాడు. కోహ్లీ ఫీల్డింగ్‌లో అదరగొడుతూ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో డికాక్(52; 37బంతుల్లో 8ఫోర్లు)తో పెవిలియన్ బాటపట్టాడు.
వన్ డౌన్‌లో దిగిన డాస్సెన్(1) 5 బంతుల వ్యవధిలో జడేజా చేతిలో అవుట్ అయి వెనుదిరిగాడు. హాఫ్ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో బావుమా(49)వికెట్‌ను జడేజా చేజిక్కించుకున్నాడు. డేవిడ్ మిల్లర్(18)లు అవుట్ అవగా ప్రిటోరియస్(10), ఫెలుక్వాయో(8)నాటౌట్‌లుగా ముగించారు.