Venkatesh Iyer trade : ట్రేడింగ్ వార్తలపై ఎట్టకేలకు మౌనం వీడిన వెంకటేశ్ అయ్యర్.. కేకేఆర్ మేనేజ్‌మెంట్ ఏం చెప్పిందంటే?
వెంటేశ్ అయ్యర్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని (Venkatesh Iyer trade) కేకేఆర్ భావిస్తోందని వార్తలు వస్తున్నాయి.

Venkatesh Iyer finally broke his silence on reports of a possible trade to SRH
Venkatesh Iyer trade : ఐపీఎల్ 2025 మెగా వేలంలో టీమ్ఇండియా ఆటగాడు వెంకటేశ్ అయ్యర్(Venkatesh Iyer)ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసింది. అతడికి వైస్ కెప్టెన్సీ బాధ్యతలను సైతం అప్పగించింది. అయితే.. ఐపీఎల్ 18వ సీజన్‌లో వెంకటేశ్ అయ్యర్ పెద్దగా రాణించలేదు. ఈ సీజన్‌లో అతడు కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిని కొన్ని మ్యాచ్‌ల్లో తుది జట్టు నుంచి తొలగించారు.
ఇక సీజన్ ముగిసిన తరువాత వెంటేశ్ అయ్యర్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని (Venkatesh Iyer trade) కేకేఆర్ భావిస్తోందని.. కాగా అతడి ట్రేడింగ్ ద్వారా దక్కించుకోవాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అతడి బదులుగా కేకేఆర్‌కు ఇషాన్ కిషన్‌ను బదిలి చేయనున్నట్లు సదరు వార్తల సారాంశం. దీనిపై ఇప్పటి వరకు అటు కేకేఆర్, ఇటు సన్‌రైజర్స్ గానీ స్పందించలేదు. తాజాగా ఈ వార్తల పై వెంకటేశ్ అయ్యర్ స్పందించాడు.
అవన్నీ అవాస్తవాలేనని చెప్పాడు. ట్రేడింగ్ గురించి ఇప్పటి వరకు తనకు ఎలాంటి సమాచారం లేదన్నాడు. కేకేఆర్ మేనేజ్‌మెంట్ కూడా తనతో ఈ విషయం గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదన్నాడు.
తన పేలవ ఫామ్ పై వచ్చిన విమర్శల గురించి..
ఐపీఎల్ 2025 సీజన్‌లో పేలవ ప్రదర్శన చేయడంతో వెంకటేశ్ అయ్యర్ ఎన్నో విమర్శలను ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో అయితే అతడిపై ఎన్నో మీమ్స్, కామెంట్లు వచ్చాయి. దీనిపై అయ్యర్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటిని తాను పట్టించుకోనని చెప్పాడు. తన గురించి కామెంట్లు చేసే వారు ఎవరూ కూడా తన కాంటాస్ట్ లిస్ట్‌లో కూడా లేరన్నాడు. కాబట్టి వారి గురించి తాను ఎందుకు ఆలోచించాలని ప్రశ్నించాడు.
‘ఇది నా జీవితం, నా ఆట, నా కెరీర్.. నా కోసం ఇంత ఖర్చు చేయడానికి జట్టు అనుకుంది. మిగతా వాటి గురించి నాకెందుకు?’ అని వెంకటేశ్ అయ్యర్ అన్నాడు. ఇక ప్రతి ఒక్కరు కూడా కూడా ఐపీఎల్ ఆడాలని కోరుకుంటారన్నాడు. ఒక్కొసారి రూ.20లక్షలు కూడా చాలా పెద్ద అమౌంట్ గా కనిపిస్తుందన్నాడు. ఇక తన వల్ల ఎవరు అయితే.. ప్రత్యక్షంగా ప్రభావితం అవుతారో వారికి మాత్రమే తాను జవాబుదారీగా ఉంటానని చెప్పాడు.