Virender Sehwag : అప్పుడు సచిన్ ఆపాడు.. లేదంటేనా.. 2011 వన్డే ప్రపంచకప్‌కు మూడేళ్ల ముందు జరిగిన విషయాన్ని వెల్లడించిన సెహ్వాగ్..
టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వల్ల ఎంతో మంది బౌలర్లు ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపారు.

Tendulkar convinced Virender Sehwag to think his otherwise over ODI retirement
Virender Sehwag : టీమ్ఇండియా మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) వల్ల ఎంతో మంది బౌలర్లు ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడిపారు. ప్రత్యర్థి బౌలర్లను అంతలా భయపెట్టిన సెహ్వాగ్ సైతం ఒకానొక సమయంలో ఫామ్ కోల్పోయి ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత జట్టు గెలుచుకోవడంలో తన వంతు పాత్ర పోషించాడు. అయితే.. ఈ వన్డే ప్రపంచకప్‌కు మూడేళ్ల ముందే తాను వన్డేల నుంచి రిటైర్‌మెంట్ కావాలని అనుకున్నట్లు సెహ్వాగ్ చెప్పాడు. కానీ దిగ్గజ ఆటగాడు, సహచర క్రికెటర్ అయిన సచిన్ సలహాతోనే తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లుగా తెలిపాడు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సెహ్వాగ్ ఈ విషయాన్ని వెల్లడించాడు. 2007-08 సీజన్‌లో కామన్వెల్త్ బ్యాంక్ సిరీస్ జరిగింది. భారత్, ఆస్ట్రేలియా, శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఈ ట్రై సిరీస్‌లో మొదటి మూడు మ్యాచ్‌ల్లోనూ సెహ్వాగ్ ఆడాడు. అయితే.. ఆ మ్యాచ్‌ల్లో అతడు పెద్దగా రాణించలేదు. దీంతో అతడిని తుది జట్టు నుంచి అప్పటి కెప్టెన్ ఎంఎస్ ధోని (MS Dhoni) తప్పించాడు. ఆ సమయంలో తాను ఎంతో బాధపడినట్లు సెహ్వాగ్ చెప్పాడు.
సచిన్ ఆగమని చెప్పడంతోనే..
‘జట్టుతో పాటు ఉంటూ తుది జట్టులో చోటు దక్కకపోవడంతో వన్డేలు ఆడడం అనవసరం అని భావించాను. వన్డేలకు రిటైర్‌మెంట్ చెప్పాలని అనుకున్నాను. ఇక ఇదే విషయాన్ని సచిన్ (Sachin Tendulkar)దగ్గరికి వెళ్లి చెప్పాను. అప్పుడు సచిన్ ఇలా అన్నాడు.. వద్దు నేను కూడా నీలాగే 1999-2000లో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాను. అప్పుడు క్రికెట్‌ను వదిలేద్దామని అనిపించింది. అయితే.. ఆ దశ వచ్చింది, వెళ్లింది. కాబట్టి.. ఒక కష్టం ఎదురు అయినప్పుడు భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకోవద్దు. ఇంకో ఒకటి లేదా రెండు సిరీస్‌లు వేచి చూడు. అప్పుడు ఓ నిర్ణయానికి రా. అని అన్నాడు. ఆ తరువాత నేను నా ఫామ్ దృష్టి పెట్టా.. అవకాశం వచ్చిన సిరీస్‌లో చాలా పరుగులు చేశా.. అలా 2011 వన్డే ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాను.’ అని సెహ్వాగ్ అన్నాడు.
ధోని నాయకత్వంలో 2011 వన్డే ప్రపంచకప్‌ను భారత్ గెలుచుకున్న సంగతి తెలిసిందే.
1999లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్ ద్వారా సెహ్వాగ్ వన్డేల్లోకి అడుగుపెట్టాడు. ఆ తరువాత రెండేళ్లకు 2001లో దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా సుదీర్ఘ ఫార్మాట్‌లో అడుగుపెట్టాడు.
సెహ్వాగ్ తన కెరీర్‌లో 251 వన్డే మ్యాచ్‌లు, 104 టెస్టులు, 19 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. వన్డేల్లో 35 సగటుతో 8273 పరుగులు చేశాడు. ఇందులో 15 సెంచరీలు, 38 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో 49.3 సగటుతో 8586 పరుగులు చేశాడు. ఇందులో 23 సెంచరీలు, 32 అర్ధశతకాలు ఉన్నాయి. ఇక టెస్టుల్లో రెండు సార్లు త్రిపుల్ సెంచరీ చేసిన ఏకైక భారత ఆటగాడిగా సెహ్వాగ్ రికార్డులకు ఎక్కాడు. ఇక టీ20ల్లో 21.9 సగటుతో 394 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.