సొంతగడ్డపై సఫారీలను చిత్తు చేసింది టీమిండియా. మూడు టెస్టుల సిరీస్ లో భాగంగా ఇప్పటికే రెండు టెస్టుల ఆధిక్యంతో కొనసాగుతున్న భారత్ మూడో టెస్టులోనూ అదే దూకుడు కొనసాగించింది. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ ను 497పరుగుల వద్ద డిక్లేర్ చేసి.. సఫారీలను ఘోరంగా కట్టడి చేశారు. ఫలితంగా దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ 162పరుగులకే ఆలౌట్ గా వెనుదిరిగారు. మరోసారి కోహ్లీ పాత వ్యూహాన్నే అమలు చేస్తూ దక్షిణాఫ్రికాను ఫాలో ఆన్ కు ఆహ్వానించాడు.
భారత బౌలర్లు మొహ్మద్ షమీ, రవీంద్ర జడేజా, షెబాజ్ నదీమ్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, ఉమేశ్ యాదవ్ 3 వికెట్లు తీయగలిగాడు. తొలి ఇన్నింగ్స్ ను భారత్ ఆచితూచి ఆరంభించినప్పటికీ రోహిత్(212), రహానె(115)ల జోడీ స్కోరు బోర్డు చక్కదిద్దింది.
ఈ క్రమంలో రోహిత్ శర్మ.. 130 బంతుల్లో సెంచరీ బాదేసి 249 బంతుల్లోనే డబుల్ సెంచరీ పూర్తి చేయగలిగాడు. ఫలితంగా దక్షిణాఫ్రికాపై టీమిండియా తరపున డబుల్ సెంచరీ బాదిన ప్లేయర్ల జాబితాలో చేరిపోయాడు. ఆ తర్వాత రహానె సెంచరీకి మించిన స్కోరుతో జడేజాతో కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని కొనసాగించాడు. జడేజా హాఫ్ సెంచరీ జట్టుకు మంచి బలాన్ని చేకూర్చింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో జార్జ్ లిండే నాలుగు, రబాడ మూడు వికెట్లు తీశారు.
రోహిత్ శర్మ రికార్డులు:
భారత ఓపెనర్ రోహిత్‌శర్మ తన ఖాతాలో అనేక రికార్డులు వేసుకున్నాడు. మొదటి రోజు ఆటలో సెంచరీకి మరొకటి చేర్చి డబుల్‌టన్‌గా మార్చేశాడు. వన్డేలతో పాటు టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన మూడో ఇండియన్ బ్యాట్స్‌మన్‌గా రికార్డు క్రియేట్ చేశారు. ఈ ఫీట్ ఇంతకు ముందు సచిన్, సెహ్వాగ్ పేరిట ఉంది. డబుల్ సెంచరీ చేసిన రోహిత్ శర్మ..ఈ టెస్ట్ సిరీస్‌లో 500 పరుగులు చేసిన రికార్డు నెలకొల్పాడు. ఇలా ఒకే టెస్ట్ సిరీస్‌లో 500 పరుగులు చేయడమో రికార్డు.
ఒకే సిరీస్‌లో 16 సిక్సర్లు కొట్టిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. ఇలా ఓ సిరీస్‌లో టీమిండియా తరపున సిక్సర్లు ఎక్కువగా కొట్టింది హర్భజన్ సింగ్. అతను 14 సిక్సర్లు కొట్టాడు. రోహిత్ డబుల్‌టన్‌లో 28 ఫోర్లు..6 సిక్సర్లు బాదాడు. రోహిత్ శర్మ ఈ రేంజ్‌లో చెలరేగబట్టే టీమిండియా వరసగా వికెట్లు కోల్పోతున్నా భారీ స్కోర్ సాధించగలిగింది.