Ravichandran Ashwin : ఆసియాకప్ 2025 పై అశ్విన్ సంచలన వ్యాఖ్యలు.. దక్షిణాఫ్రికానైనా చేరిస్తే బాగుండేది.. మ్యాచ్‌లు ఏమంత..
ఆసియాకప్ 2025 పై టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ (Ravichandran Ashwin) సంచలన వ్యాఖ్యలు చేశాడు.

Ashwin slams lack of competitiveness in T20 Asia Cup 2025
Ravichandran Ashwin : ఆసియాకప్ 2025 పై టీమ్ఇండియా మాజీ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. నానాటికి ఆసియాకప్‌లో ప్రమాణాలు పడిపోతున్నాయని చెప్పుకొచ్చాడు. అసలుసిసలైన పోటీ ఎక్కడ అంటూ ప్రశ్నించాడు. ఈ టోర్నీని టీ20 ప్రపంచకప్ 2026కు సన్నాహకంగా భావించడం సరికాదన్నాడు.
మంగళవారం (సెప్టెంబర్ 9) నుంచి ఆసియాకప్ 2025 ప్రారంభమైంది. తొలి మ్యాచ్‌లో అఫ్గానిస్తాన్, హాంగ్‌కాంగ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో అఫ్గాన్ జట్టు 94 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఈ క్రమంలో అశ్విన్ (Ravichandran Ashwin) చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
ఆసియాకప్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాలంటే ఎన్నో మార్పులు చేయాలన్నాడు. దక్షిణాఫ్రికాను ఈ ఎడిషన్‌లో చేర్చి ఆఫ్రో-ఆసియాకప్‌గా నిర్వహిస్తే బాగుండేదని అభిప్రాయపడ్డాడు. ఆఖరికి భారత్-ఏ జట్టును అదనంగా చేర్చినా కూడా పోటీ బాగుండేదని చెప్పుకొచ్చాడు. బంగ్లాదేశ్ గురించి మాట్లాడానికి ఏం లేదన్నాడు. మిగిలిన జట్ల సంగతి కూడా అంతేనన్నాడు. ఈ జట్లు భారత్‌కు ఎలాంటి పోటీని ఇవ్వలేవన్నాడు.
IND vs UAE : యూఏఈతో మ్యాచ్.. భారీ రికార్డుపై అర్ష్‌దీప్ సింగ్ కన్ను..
చాలా మంది చెబుతున్నట్లుగా టీ20 ప్రపంచకప్ 2026కు సన్నద్దం అయ్యేందుకు ఈ టోర్నీ కీలకం కాదన్నాడు. ఈ టోర్నీలో పెద్దగా పోటీ ఉండదన్నాడు. అఫ్గాన్ బౌలింగ్ ను చూసిన తరువాత తనకు ఇదే అనిపించిందన్నాడు. టీమ్ఇండియా, అప్గాన్ జట్ల మధ్య మ్యాచ్ జరిగితే.. అఫ్గాన్ ముందు 170 ఫ్లస్ పరుగుల లక్ష్యం ఎదురైతే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాడు. మ్యాచ్ ఏకపక్షంగా మారుతుందన్నాడు.
ఇక ఈ టోర్నీలో భారత్‌ను ఓడించాలంటే ఏ జట్టుకైనా ఆ రోజు ఎంతో బాగా కలిసిరావాలన్నాడు. వాస్తవానికి పొట్టి క్రికెట్‌లో మ్యాచ్‌లు ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగుతాయన్నాడు. అయితే.. ఆసియాకప్‌లో టీమ్ఇండియా ఆడే మ్యాచ్‌లు అన్ని ఏకపక్షంగానే జరుగుతాయని అశ్విన్ తెలిపాడు.
అఫ్గాన్, హాంగ్‌కాంగ్ మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. అఫ్గాన్ బ్యాటర్లలో సెదిఖుల్లా అటల్ (73 నాటౌట్), అజ్మతుల్లా ఒమర్‌జాయ్ (53) లు రాణించారు. అనంతరం 189 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన హాంగ్‌కాంగ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 94 పరుగులకే పరిమితమైంది. హాంగ్‌కాంగ్ బ్యాటర్లలో బాబర్ హయత్ (39; 43 బంతుల్లో 3 సిక్సర్లు) టాప్ స్కోరర్.
ఇక ఈ మెగాటోర్నీలో భారత జట్టు తన తొలి మ్యాచ్‌ను నేడు ఆడనుంది. ఆతిథ్య యూఏఈతో దుబాయ్ వేదికగా తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.