IND vs SA T20 Match
IND vs SA T20 Match : ఇండియా వర్సెస్ దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం రాత్రి రెండో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టు ఓటమి పాలైంది. బ్యాటింగ్‌లో, బౌలింగ్‌లోనూ జట్టు ఆటగాళ్లు ఆశించిన స్థాయిలో రాణించలేక పోయారు. దీంతో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ జట్టు ఓటమికి కారణాలను వెల్లడించాడు.
సూర్య మాట్లాడుతూ.. తన వల్లే ఈ పరాజయం ఎదురైందని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా పిచ్ కండిషన్స్‌ను అర్ధం చేసుకోవడంలో విఫలమయ్యాం. ప్లాన్-బీని అమలు చేయలేకపోయాం. టాస్ గెలిచిన మేము ముందుగా బ్యాటింగ్ చేస్తే బాగుండేది. కానీ, బౌలింగ్ ఎంచుకున్నాం. అయినప్పటికీ మేము బాగానే పుంజుకున్నాం. కానీ, ముందుగా బ్యాటింగ్ చేయడం వల్ల ఏ లెంగ్త్‌లలో బౌలింగ్ చేయాలనే విషయం సౌతాఫ్రికా బౌలర్లకు బాగా అర్ధమైంది. అయినా పర్వాలేదు. ఈ మ్యాచ్ మాకు ఓ గుణపాఠం. సౌతాఫ్రికా బౌలింగ్ చేసిన విధానం నుంచి మేము పాఠం నేర్చుకున్నాం.
శుభ్‌మాన్ గిల్, నేను మెరుగైన ఆరంభాన్ని ఇవ్వాల్సి ఉంది. కానీ ఇద్దరం పరుగులు రాబట్టడంలో విఫలం అయ్యాం. అభిషేశ్ శర్మపై ఎప్పుడూ ఆధారపడలేం. అతను దూకుడుగా బ్యాటింగ్ చేస్తాడు. ఆ సమయంలో ఎప్పుడైన విఫలం కావొచ్చు. నేను, గిల్, మా తరువాతి బ్యాటర్లు జట్టుకు సాధ్యమైనన్ని పరుగులు సాధించడంపై దృష్టిపెట్టాలి. కానీ, అలా జరగలేదు. తదుపరి మ్యాచ్ లో మెరుగైన ప్రదర్శం ఇచ్చేందుకు సన్నద్ధమవుతాం. గత మ్యాచ్ తరహాలో అక్షర్ పటేల్, హార్డిక్ రాణిస్తారని ఆశించాం. కానీ, దురదృష్టవశాత్తు అది జరగలేదు అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.