Shreyas Iyer : జింబాబ్వేతో టీ20 మ్యాచ్.. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్.. వైభవ్ గురించి ఏమన్నాడంటే?

India vs Zimbabwe : ఈనెల 23న ఇండియా వర్సెస్ జింబాబ్వే జట్ల మధ్య తొలి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ టీమిండియా కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ కీలక కామెంట్స్ చేశాడు.

Shreyas Iyer

India vs Zimbabwe : ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలో భారత జట్టు ఆశించిన ఫలితాలు సాధించలేకపోయినా, ఆ అనుభవం భవిష్యత్‌లో జట్టును మరింత బలోపేతం చేస్తుందని టీ20 కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నారు. జింబాబ్వేతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Also Read : BCCI : కొత్త రూల్స్ తెచ్చిన బీసీసీఐ.. ఒక‌టి కాదు రెండు కాదు.. ఏకంగా ఐదు..

ఇంగ్లండ్ టూర్ తమకు కఠిన పరీక్షగా మారిందని అంగీకరించిన అయ్యర్, అయితే, ఆ పర్యటన ద్వారా జట్టుగా ఏ అంశాల్లో మెరుగుపడాలో స్పష్టంగా తెలుసుకున్నామని చెప్పారు. విదేశీ పరిస్థితులకు త్వరగా అలవాటు పడడం, మైదానంలో చురుకైన ఆలోచన, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోవడం ఎంత ముఖ్యమో ఈ పర్యటన నేర్పిందంటూ శ్రేయాస్ అయ్యర్ చెప్పారు.

ఇంగ్లండ్, ఐర్లాండ్‌లో వరుస పరాజయాలు ఎదురైనా అవి జట్టును మరింత ఐక్యంగా మార్చాయని అయ్యర్ తెలిపారు. ఆటగాళ్ల మధ్య మంచి చర్చలు జరిగాయని, జట్టుగా ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై స్పష్టమైన అవగాహన ఏర్పడిందన్నారు. విదేశాల్లో వరుస సిరీస్‌లు ఆడటం యువ ఆటగాళ్లకు మంచి అనుభవాన్ని అందిస్తోందని చెప్పారు.

ఇక జింబాబ్వే సిరీస్‌లో యువ ఆటగాళ్లు ఎలాంటి భయం లేకుండా ఆడాలని శ్రేయాస్ సూచించారు. ఓటమికి భయపడితే ఆటను స్వేచ్ఛగా ఆడలేమని, గత ఫలితాల గురించి కాకుండా ప్రస్తుత ఆటపైనే దృష్టి పెట్టాలని ఆయన పేర్కొన్నారు. జట్టుగా ఐక్యంగా ఆడితే విజయాలు తప్పక వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు.

యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ గురించి శ్రేయస్ అయ్యర్‌ను మీడియా ప్రశ్నించగా.. ఇంగ్లండ్ సిరీస్ తర్వాత మా బాయ్స్‌కు తగినంత విరామం దొరికింది. దీంతో యువ ఆటగాళ్లంతా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించారు. వైభవ్ కూడా ఎక్కడ తప్పు చేశాడో దాన్ని సరిదిద్దుకుని ఉంటాడు. అందుకే నేను అతడికి పెద్దగా సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని శ్రేయస్ అయ్యర్ పేర్కొన్నారు.

భారత్-జింబాబ్వే మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరగనున్నాయి. ఈ సిరీస్‌తో భారత జట్టు విజయాల బాట పట్టాలని శ్రేయస్ అయ్యర్ ఆశాభావం వ్యక్తం చేశారు. శ్రేయస్‌ నేతృత్వంలో భారత జట్టు జింబాబ్వే జట్టుతో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం తొలి మ్యాచ్‌లో తలపడనుంది. 25 (శనివారం), 26 (ఆదివారం) మ్యాచ్‌లు జరగనున్నాయి.