IND vs ENG 3rd Test : రాజ్‌కోట్‌లో టీమ్ఇండియా రాజ‌సం.. ఇంగ్లాండ్‌పై భారీ విజ‌యం

మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది.

IND vs ENG 3rd Test

IND vs ENG : మూడో టెస్టు మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘ‌న విజ‌యం సాధించింది. 557 ప‌రుగుల విజ‌య ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ 39.4 ఓవ‌ర్ల‌లో 122 ప‌రుగుల‌కే కుప్ప‌కూలింది. దీంతో భార‌త్ 434 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఈ విజ‌యంతో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌తో భార‌త్ 2-1 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.

భారీ ల‌క్ష్యాన్ని ఛేదించేందుకు బ‌రిలోకి దిగిన ఇంగ్లాండ్ ఏ ద‌శ‌లోనూ సాధికారికంగా ఆడ‌లేదు. భార‌త బౌల‌ర్లు విజృంభించ‌డంతో జాక్‌క్రాలీ (11), బెన్ డ‌కెట్ (4), ఒలిపోప్ (3), జో రూట్ (7), జానీబెయిర్ స్టో (4), కెప్టెన్ బెన్‌స్టోక్స్ (15), రెహాన్ అహ్మ‌ద్ (0) లు విఫ‌లం కావ‌డంతో 50 ప‌రుగుల‌కే ఏడు వికెట్లు కోల్పోయి పీక‌ల్లోతు క‌ష్టాల్లో ప‌డింది. ఈ ద‌శ‌లో వికెట్ కీప‌ర్ బెన్‌ఫోక్స్ (16), టామ్ హార్డ్లీ(16) లు కాసేపు వికెట్ల ప‌త‌నాన్ని అడ్డుకున్నారు. 32 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని జోడించారు.

Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహమాన్ త‌ల‌కు గాయం.. ఐసీయూలో చికిత్స‌

ప్ర‌మాద‌క‌రంగా మారుతున్న ఈ జోడీని బెన్‌ఫోక్స్‌ను ఔట్ చేయ‌డం ద్వారా జ‌డేజా విడ‌దీశాడు. ఆ త‌రువాత ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసేందుకు ఎంతో సేపు ప‌ట్ట‌లేదు. భార‌త బౌల‌ర్ల‌లో ర‌వీంద్ర జ‌డేజా ఐదు వికెట్లు తీశాడు. కుల్దీప్ యాద‌వ్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టాడు. బుమ్రా, అశ్విన్ లు చెరో వికెట్ తీశారు.

జైస్వాల్ డ‌బుల్ సెంచ‌రీ..

ఓవ‌ర్ నైట్ స్కోరు 196/2 తో నాలుగో రోజు రెండో ఇన్నింగ్స్‌ను భార‌త్ ప్రారంభించింది. నైట్ వాచ్‌మ‌న్ కుల్దీప్‌యాద‌వ్ (27)తో క‌లిసి శుభ్‌మ‌న్ గిల్ (91; 151 బంతుల్లో 9 ఫోర్లు, 2సిక్స‌ర్లు) లు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌కు ఎలాంటి అవ‌కాశం ఇవ్వ‌లేదు. వీరిద్ద‌రు తొలి గంట ఆచితూచి ఆడారు. అయితే.. స‌మ‌న్వ‌య లోపం కార‌ణంగా సెంచ‌రీకి తొమ్మిది ప‌రుగుల దూరంలో గిల్ ఔట్ అయ్యాడు. గిల్‌-కుల్దీప్ యాద‌వ్‌లు మూడో వికెట్‌కు 55 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.

వెన్నునొప్పి కార‌ణంగా రెండో రోజు రిటైర్డ్ హ‌ర్ట్‌గా మూడో రోజు మైదానాన్ని వీడిన య‌శ‌స్వి జైస్వాల్ (214; 236 బంతుల్లో 14ఫోర్లు, 12 సిక్స‌ర్లు) మ‌ళ్లీ బ్యాటింగ్‌కు వ‌చ్చాడు. త‌న‌దైన శైలిలో దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. ఓ వైపు జైస్వాల్ ప‌రుగులు సాధిస్తుంటే మ‌రోవైపు నిల‌క‌డ‌గా ఆడిన కుల్దీప్ యాద‌వ్‌ను రెహాన్ అహ్మ‌ద్ ఔట్ చేశాడు. ఈ ద‌శ‌లో య‌శ‌స్వికి అరంగ్రేట ఆట‌గాడు, తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ‌శ‌త‌కం బాదిన స‌ర్ఫ‌రాజ్ ఖాన్ (68 నాటౌట్; 72 బంతుల్లో 6 ఫోర్లు, 3సిక్స‌ర్లు) జ‌త‌క‌లిశాడు.

Yashasvi Jaiswal : య‌శ‌స్వి జైస్వాల్ సిక్స‌ర్ల మోత‌.. ప్ర‌పంచ రికార్డు స‌మం

వీరిద్ద‌రు ఇంగ్లాండ్ బౌల‌ర్ల‌ను లెక్క‌చేయ‌లేదు. బౌండ‌రీలు బాదుతూ పోటాపోటీగా ప‌రుగులు రాబ‌ట్టారు. ఈ క్ర‌మంలో జైస్వాల్ త‌న కెరీర్‌లో రెండో డ‌బుల్ సెంచ‌రీని న‌మోదు చేయ‌గా, స‌ర్ఫ‌రాజ్ త‌న అరంగ్రేటం మ్యాచ్‌లో రెండో హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. కాసేప‌టికే భార‌త్ రెండో ఇన్నింగ్స్‌లో 430/4 స్కోరు వ‌ద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ లో ల‌భించిన 126 ప‌రుగుల ఆధిక్యం క‌లుపుకుని ఇంగ్లాండ్ ముందు 557 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య రాంచీ వేదిక‌గా ఫిబ్ర‌వ‌రి 23 నుంచి నాలుగో టెస్టు మ్యాచ్ ఆరంభం కానుంది..

ట్రెండింగ్ వార్తలు