IND vs ENG: అదరగొట్టారు.. ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన టీమిండియా.. 13ఏళ్ల తరువాత తొలిసారి సిరీస్ కైవసం

ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకున్నారు.

IND vs ENG

IND vs ENG: ఇంగ్లాండ్ గడ్డపై టీమిండియా ప్లేయర్లు అదరగొట్టారు. 2012 నుంచి ఇంగ్లాండ్‌లో ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లు ఆడుతున్న భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారి సిరీస్‌ను కైవసం చేసుకొని విజయఢంకా మోగించింది. తద్వారా చరిత్ర సృష్టించింది. ఇంగ్లాండ్ గడ్డపై భారత జట్టు ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడుతుంది. ఈ సిరీస్‌లో భాగంగా బుధవారం జరిగిన నాల్గో టీ20 మ్యాచ్‌లో భారత జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1 తేడాతో సిరీస్ ను భారత మహిళా క్రికెట్ జట్టు కైవసం చేసుకుంది.

Also Read: IND vs ENG: నాలుగేళ్ల తర్వాత తుది జట్టులోకి ఫాస్ట్ బౌలర్.. మూడో టెస్టులో ఇంగ్లాండ్ వ్యూహం ఫలిస్తుందా..

మహిళల క్రికెట్‌లో టీమిండియా ఇంగ్లాండ్ లో ఇప్పటి వరకు నాలుగు టీ20 సిరీస్ లు ఆడింది. ఇందులో ఇంగ్లాండ్ మూడు, భారత్ ఒక సిరీస్ గెలుచుకున్నాయి. 2012, 2021, 2022 సిరీస్‌లలో ఇంగ్లాండ్ విజయం సాధించగా.. ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో జరుగుతున్న టీ20 సిరీస్ (2025)లో భారత మహిళా జట్టు మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ విజేతగా నిలిచింది. ఈ సిరీస్ లో చివరి మ్యాచ్ జులై 12వ తేదీన జరగనుంది.

బుధవారం మాంచెస్టర్ వేదికగా నాల్గో టీ20 మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత స్పిన్నర్లు అదరగొట్టారు. రాధా యాదవ్, శ్రీ చరణి చెరో రెండు వికెట్లు పడగొట్టగా.. దీప్తి శర్మ ఒక వికెట్ తీసింది. వీరు పొదుపుగా బౌలింగ్ చేసి వరుసగా వికెట్లు పడగొట్టారు. దీంతో ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 126 పరుగులు మాత్రమే చేసింది. ఆ తరువాత బ్యాటింగ్ చేసిన భారత జట్టు మూడు ఓవర్లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది.


బర్మింగ్‌హోమ్ వేదికగా ఇంగ్లాండ్, భారత జట్ల మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ తరువాత ఇరు జట్ల మధ్య మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ జరుగుతుంది. జులై 16, 19, 22 తేదీల్లో సౌతాంప్టన్, లార్డ్స్, చెస్టర్ లీ స్ట్రీట్ లో ఈ మ్యాచ్ లు జరగనున్నాయి.