IPL 2020, CSK Vs SRH: హైదరాబాద్‌తో మ్యాచ్‌కు ముందు చెన్నై ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. స్టార్ ప్లేయర్స్ రెడీ!

  • Publish Date - October 1, 2020 / 03:34 PM IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 13 వ సీజన్‌లో ఇప్పటివరకు ధోని జట్టు CSK ప్రదర్శన నిరాశాజనకంగా ఉంది. CSK గత రెండు మ్యాచ్‌ల్లో ఓడిపోగా.. ఒక్క ముబైతో మ్యాచ్‌లో మాత్రమే గెలిచింది. ఈ క్రమంలో చెన్నై ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో ఉన్నారు. అయితే అక్టోబర్ 2 న చెన్నై సూపర్ కింగ్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో తలపడనుండగా.. ఈ మ్యాచ్‌కు ముందు సీఎస్‌కేకు పెద్ద ఉపశమనం లభించింది. CSK స్టార్ ప్లేయర్స్ అంబటి రాయుడు, డ్వేన్ బ్రావో పూర్తిగా ఫిట్‌గా ఉన్నారు. ఈ మ్యాచ్‌లో వారిద్దరు ఆడబోతున్నారు.



ముంబై ఇండియన్స్‌పై విజయం సాధించడంతో కీలకంగా ఉన్న హీరో రాయుడు, కండరాల ఒత్తిడి కారణంగా తదుపరి రెండు మ్యాచ్‌లు ఆడలేకపోయాడు. అదే సమయంలో, కరేబియన్ ప్రీమియర్ లీగ్ (CPL) సమయంలో గాయపడిన బ్రావో.. ఐపిఎల్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ మ్యాచ్‌కి మాత్రం అందుబాటులోకి వచ్చేస్తున్నాడు.


ఈ ఇద్దరు ఆటగాళ్ల రాకతో జట్టు మిడిల్ ఆర్డర్ సమస్య పరిష్కారం అవుతుంది. మురళి విజయ్ స్థానంలో రాయుడు జట్టులో చేరవచ్చు. బ్రావోకు జట్టులో చోటు రావాలంటే మాత్రం సీఎస్‌కే కాస్త ఇబ్బందిని ఎదుర్కోక తప్పదు. మూడు మ్యాచ్‌ల్లోనూ బాగా రాణించగలిగిన సామ్ కురెన్ స్థానంలో బ్రావోను తీసుకోవలసి ఉంటుంది. అది కుదరకపోతే బ్రావోకు స్థానం ఇవ్వడానికి వాట్సన్ లేదా హాజిల్‌వుడ్‌లలో ఒకరిని పక్కన పెట్టాలి.



CSK తమ విదేశీ ఆటగాళ్లలో ఎలాంటి మార్పులు చేయకుండా బరిలోకి దిగే అవకాశం కూడా ఉంది, ఎందుకంటే వాట్సన్‌ను తొలగించడం జట్టుకు సమస్య అవుతుంది. అదే సమయంలో, హాజిల్‌వుడ్ ఐపిఎల్‌లో ఆడిన తొలి మ్యాచ్‌లో అధ్బుతంగా రాణించారు.