ఐపీఎల్‌ 2020: మార్పులు ఎన్నో.. రెండు నెలలు పాటు మ్యాచ్‌లు

  • Publish Date - October 22, 2019 / 07:02 AM IST

వరల్డ్‌ రిచెస్ట్‌ టీ20 క్రికెట్‌ లీగ్‌ ఇండియన్ ప్రీమియర్ లీగ్.. రాబోయే సీజన్‍‌‌ను మరింత రసవత్తరంగా మార్చేందుకు ఐపీఎల్ సిద్ధం అయ్యింది. రాబోయే సీజన్‌లో పలు మార్పులకు నాంది పలికేందుకు ప్రణాళికలు వేస్తుంది బీసీసీఐ. 

ఐపీఎల్‌2020 సీజన్‌ను మరో 15 రోజుల పాటు పొడిగించాలనే ప్రతిపాదనకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు వచ్చే ఐపీఎల్‌ గవర్నింగ్‌ కౌన్సిల్‌ సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు నిర్వాహకులు. ప్రస్తుతం 45 రోజులు సాగుతున్న ఈ పొట్టి క్రికెట్‌ టోర్నీని రెండు నెలలకు పొడిగించాలని బీసీసీఐ భావిస్తోందని ఓ పేరు వెల్లడించని అధికారి చెప్పారు.

ఐపీఎల్‌లో మధ్యాహ్నం మ్యాచ్‌లను కుదించి రాత్రి మ్యాచ్‌లను పెంచాలని, ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఇకపై ఒక్కో జట్టు సీజన్‌లో ఒకటే మధ్యాహ్నం మ్యాచ్‌ ఆడేలా షెడ్యూల్ ఖరారు చేయాలని బోర్డు భావిస్తుంది.

దీంతో వీకెండ్ జరిగే రెండు మ్యాచ్‌ల సంఖ్య తగ్గించాలని అనుకుంటున్నారు. ఇలా కాని పక్షంలో ప‍్రతీ మ్యాచ్‌ను సాయంత్రం 7.00గం.లకు మాత్రమే జరిపితే ఎలా ఉంటుందనే కోణాన్ని కూడా పరిశీలిస్తున్నారు. ఒక కోణంలో చూస్తే 45రోజుల షెడ్యూలే ఎక్కువ అనిపిస్తోంది.

అటువంటిది రెండు నెలలకు పొడిగిస్తే ఆ లీగ్‌ బోర్‌ కొట్టే అవకాశం కూడా లేకపోలేదు. అయితే బోర్డు మాత్రం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం మాత్రం కచ్చితంగా కనిపిస్తుంది. ఐపీఎల్‌2020 సీజన్‌ ఏప్రిల్‌ 1 వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. డిసెంబర్‌లో ఆటగాళ్ల వేలం జరిగే అవకాశం ఉంది.