IPL 2024 DC vs LSG : కీలక మ్యాచ్‌లో లక్నోపై 19 పరుగుల తేడాతో ఢిల్లీ విజయం..

IPL 2024 DC vs LSG : ఢిల్లీ నిర్దేశించిన 208 పరుగుల విజయ లక్ష్యాన్ని లక్నో ఛేదించడంలో పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులకే లక్నో పరాజయం పాలైంది.

IPL 2024 : Dc vs LSG ( Image Credit : @IPL_Twitter/ Google )

IPL 2024 DC vs LSG : ఐపీఎల్ 2024లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన కీలక మ్యాచ్‌లో సొంతగడ్డపై ఢిల్లీ క్యాపిటల్స్ 19 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఢిల్లీ నిర్దేశించిన 208 పరుగుల విజయ లక్ష్యాన్ని లక్నో ఛేదించడంలో పోరాడి ఓడింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 189 పరుగులకే ఎల్ఎస్‌జీ జట్టు పరాజయం పాలైంది. లక్నో ఆటగాళ్లలో నికోలస్ పూరన్ (61; 27 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్), అర్షద్ ఖాన్ (58; 33 బంతుల్లో 3 ఫోర్లు, 5 సిక్స్) హాఫ్ సెంచరీలతో చెలరేగారు.


వీరిద్దరూ మినహా మిగతా ఆటగాళ్లు పేలవ ప్రదర్శనతో స్వల్ప స్కోరుకే చేతులేత్తేశారు. ఓపెనర్ క్వింటన్ డికాక్ (12), కృనాల్ పాండ్యా (18), యుధ్వీర్ సింగ్ (14) పరుగులతో రాణించగా, కెప్టెన్ కేఎల్ రాహుల్ (5), మార్కస్ స్టోయినిస్ (5), ఆయుష్ బదోని (6), రవి బిష్ణోయ్ (2), నవీన్ ఉల్ హక్ (2) సింగిల్ డిజిట్ కే పరిమితమయ్యారు.

ఢిల్లీ బౌలర్లలో ఇషాంత్ శర్మ 3 వికెట్లు పడగొట్టగా, ఖలీల్ అహ్మద్, అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్, కుల్దీప్ యాదవ్, ట్రిస్టన్ స్టబ్స్ తలో వికెట్ తీసుకున్నారు. లక్నో పతనాన్ని శాసించిన ఇషాంత్ శర్మ (3/34)కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

అభిషేక్, స్టబ్స్ హాఫ్ సెంచరీ :
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఢిల్లీ ఆటగాళ్లలో అభిషేక్ పోరెల్ (58; 33 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్), ట్రిస్టన్ స్టబ్స్ (57 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్) హాఫ్ సెంచరీలతో విజృంభించారు. మిగతా ప్లేయర్లలో షాయ్ హోప్ (38), కెప్టెన్ రిషబ్ పంత్ (33) పరుగులతో రాణించగా, అక్షర్ పటేల్ (14 నాటౌట్)తో అజేయంగా నిలిచాడు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హక్ 2 వికెట్లు, అర్షద్ ఖాన్, రవి బిష్ణోయ్ తలో వికెట్ తీసుకున్నారు.

టాప్ 5లో ఢిల్లీ :
పాయింట్ల పట్టికలో ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన 14 మ్యాచ్‌ల్లో 7 గెలిచి 7 ఓడి (-0.377) 14 పాయింట్లతో టాప్ 5 స్థానంలో నిలిచింది. లక్నో సూపర్ జెయింట్స్ జట్టు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 6 గెలిచి 7 ఓడి (-0.787) 12 పాయింట్లతో 7వ స్థానంలో నిలిచింది. లక్నోతో జరిగిన మ్యాచ్‌తో ఢిల్లీ లీగ్ దశ ముగిసింది.

Read Also : ఆర్సీబీ కెప్టెన్‌గా మళ్లీ విరాట్ కోహ్లి.. హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు

ట్రెండింగ్ వార్తలు