IPL 2024 : పది బంతుల్లోనే ఆర్సీబీని దెబ్బతీసిన బంగ్లాదేశ్ పేసర్.. మొన్న అలా.. నేడు ఇలా..! ఫొటోలు వైరల్

ఆర్సీబీపై విజయం అనంతరం ముస్తాఫిజుర్ మాట్లాడుతూ.. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించడం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు అందిస్తున్న షరతులులేని ప్రేమ, మద్దతుకోసం నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను! అంటూ పేర్కొన్నాడు. 

Mustafizur Rahman

Mustafizur Rahman : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీపై సీఎస్కే జట్టు ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆర్సీబీ ఓటమిలో బంగ్లాదేశ్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ కీలక భూమిక పోషించాడు. కేవలం 10 బంతుల్లోనే ఆర్సీబీని చిత్తు చేశాడు. ఇక్కడ మరో విషయం ఏమిటంటే.. మార్చి 18న మ్యాచ్ సమయంలో గాయం కారణంగా ముస్తాఫిజర్ రెహమాన్ మైదానంలోనే కుప్పకూలిపోయాడు. దీంతో అతన్ని స్ట్రెచర్ పై వైద్య బృందం మైదానం బయటకు తీసుకెళ్ళింది. తిరిగి నాలుగు రోజుల వ్యవధిలోనే ఆర్సీబీ ఓటమిలో బంగ్లాదేశ్ పేసర్ కీలకంగా మారాడు.

Also Read : Mustafizur Rahman : బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహమాన్ త‌ల‌కు గాయం.. ఐసీయూలో చికిత్స‌

ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా సాగింది. టాస్ గెలిచిన ఆర్సీబీ జట్టు కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నాడు. క్రీజులోకి డు ప్లెసిస్, కోహ్లీ ఓపెనర్లుగా వచ్చారు. ఆదినుంచి డు ప్లెసిస్ దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించాడు. దీంతో ఆర్సీబీ నాలుగు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 37 పరుగులు చేసింది. ఆ తరువాత ముస్తాఫిజర్ రెహమాన్ బంతిని అందుకున్నాడు. మొదటి బంతి డాట్ బాల్ కాగా, రెండో బంతిని డు ప్లెసిస్ ఫోర్ కొట్టాడు. మూడో బంతికి డు ప్లెసిస్ ఔట్ అయ్యాడు. మిగిలిన బ్యాటర్లు సైతం వరుసగా ఔట్ అవుతూ వచ్చారు. దీంతో ముస్తాఫిజుర్ 10 బంతుల్లోనే డు ప్లెసిస్, రజత్ పాటిదార్, కామెరాన్ గ్రీన్, విరాట్ కోహ్లీ వికెట్లు తీసుకొని ఆర్సీబీని కోలుకోలేని దెబ్బతీశాడు. ఈ మ్యాచ్ లో మొత్తం నాలుగు ఓవర్లు వేసిన ముస్తాఫిజుర్ 29 పరుగులు ఇచ్చి నాలుగు కీలక వికెట్లు తీశాడు.

Also Read : సర్ఫరాజ్ ఖాన్ తండ్రికి సూపర్ గిఫ్ట్.. ఎవరు పంపించారో తెలుసా?

ఈ నెల 18న చిట్టగాంగ్‌లో బంగ్లాదేశ్ – శ్రీలంక జట్ల మధ్య మూడో వన్డే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ముస్తాఫిజుర్ తొమ్మిది ఓవర్లు వేసి 39 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 10వ ఓవర్ కు ముందు అతను తన బౌలింగ్ చేయితో కొంత ఇబ్బంది పడ్డాడు. కడుపుని కూడా పట్టుకొని నేలపై కూర్చున్నాడు. దీంతో నడవలేని పరిస్థితి ఏర్పడటంతో అతన్ని వైద్య సిబ్బంది స్ట్రెచర్ పై మైదానం నుంచి బయటకు తీసుకెళ్లారు. దీంతో ముస్తాఫిజుర్ రెహమాన్ ఐపీఎల్ కు దూరమైనట్లేనని అందరూ భావించాడు. కానీ అతను వేగంగా కోలుకొని భారత్ కు వచ్చాడు. ఐపీఎల్ తొలి మ్యాచ్ లో ఆర్సీబీ ఓటమిలో కీలక భూమిక పోషించాడు. దీంతో స్ట్రెచర్ పై మైదానాన్ని వీడుతున్న సమయంలో ఫొటోలు, ప్రస్తుతం నాలుగు వికెట్లు తీసిన సమయంలో ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆర్సీబీపై విజయం అనంతరం ముస్తాఫిజుర్ మాట్లాడుతూ.. జట్టు విజయంలో కీలకంగా వ్యవహరించడం ఎల్లప్పుడూ ప్రత్యేకంగా అనిపిస్తుంది. ప్రేక్షకులు అందిస్తున్న షరతులులేని ప్రేమ, మద్దతుకోసం నేను ఎల్లప్పుడూ కృతజ్ఞుడను! అంటూ పేర్కొన్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు