IPL 2025: ఐపీఎల్ ముగింపు వేడుకల్లో భారత సాయుధ బలగాలకు ఘన నివాళి.. దేశభక్తి ఉప్పొంగేలా శంకర్ మహదేవన్ సంగీత ప్రదర్శన..

ప్రేక్షకులు త్రివర్ణ పతాకాలను రెపరెపలాడించారు. సాయుధ బలగాల పరాక్రమానికి సెల్యూట్ కొట్టారు.

Courtesy BCCI @IPL

IPL 2025: ఐపీఎల్ 2025 ముగింపు వేడుకలు దేశభక్తి ఉప్పొంగేలా సాగాయి. భారత సాయుధ బలగాల వీరత్వానికి, వారి సేవలకు అంకితం చేశారు. సంగీత దర్శకుడు శంకర్ మహదేవన్ భారత సాయుధ బలగాలకు నివాళి అర్పిస్తూ అద్భుతమైన సంగీత ప్రదర్శన ఇచ్చారు. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ప్రదర్శకు ముందు ఆయన ‘ఆపరేషన్ సిందూర్’ ను గుర్తు చేసుకున్నారు. ‘ఏ వతన్’, ‘లెహ్రా దో’, ‘కంధో సే మిల్తే హై కదమ్’ వంటి దేశభక్తి గీతాలను ఆలపించారు. స్టేడియం ప్రాంగణంలో దేశభక్తిని ఉప్పొంగించారు. ప్రేక్షకులు త్రివర్ణ పతాకాలను రెపరెపలాడించారు. సాయుధ బలగాల పరాక్రమానికి సెల్యూట్ కొట్టారు.

ఐపీఎల్ 2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచింది. పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఐపీఎల్ 2025 సీజన్‌కు ఇవాళ్టితో తెరపడనుంది. అహ్మదాబాద్‌ వేదికగా జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లలో ఏది గెలిచినా వారికిదే తొలి ఐపీఎల్ టైటిల్ కానుంది.

లీగ్ దశలో అద్భుత ప్రదర్శనతో తొలి రెండు స్థానాల్లో నిలిచిన పంజాబ్, బెంగళూరు.. ఫైనల్ చేరే క్రమంలోనూ తమదైన ముద్ర వేశాయి. క్వాలిఫయర్-1లో పంజాబ్‌పై ఘన విజయం సాధించిన ఆర్సీబీ, నాలుగోసారి ఫైనల్‌కు దూసుకెళ్లింది. మరోవైపు, పంజాబ్ కింగ్స్ జట్టు క్వాలిఫయర్ -2లో ముంబై ఇండియన్స్ పై ఘన విజయం సాధించింది. ఈ సీజన్‌లో ఈ రెండు జట్లు ఇప్పటికే మూడుసార్లు తలపడ్డాయి.