IPL 2025: మ్యాచ్ మధ్యలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య గొడవ.. అసలేం జరిగిందంటే..? వీడియో వైరల్

ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వాగ్వివాదం జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Credit BCCI

IPL 2025: ఐపీఎల్ 2025లో భాగంగా ఆదివారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (DC) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆరు వికెట్ల తేడాతో ఢిల్లీ జట్టుపై ఆర్సీబీ విజయం సాధించింది.

 

తొలుత ఢిల్లీ క్యాపిటల్ జట్టు బ్యాటింగ్ చేయగా ఎనిమిది వికెట్లు కోల్పోయి 162 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (41), స్టబ్స్ (34) పరుగులు చేశారు. ఆ తరువాత బ్యాటింగ్ ప్రారంభించిన ఆర్సీబీ జట్టు 18.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి విజేతగా నిలిచింది. విరాట్ కోహ్లీ (51), కృపాల్ పాండ్య (73నాటౌట్) రాణించడంతో నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఆర్సీబీ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది.

 

ఆర్సీబీ ఇన్నింగ్స్ సమయంలో విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వాగ్వివాదం జరిగింది. కోహ్లీ క్రీజును వదిలి వికెట్ల వెనుకాల కీపింగ్ చేస్తున్న రాహుల్ వద్దకు వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ పై సీరియస్ అయినట్లు, కేఎల్ రాహుల్ సైతం కోహ్లీకి ధీటుగా సమాధానం ఇస్తున్నట్లు వీడియోలో కనిపించింది. అయితే, వీరి మధ్య వాగ్వాదంకు కారణం ఏమిటి..? వారేం మాట్లాడుకున్నారనే విషయాలు తెలియాల్సి ఉంది.

 


ఆర్సీబీ విజయం తరువాత భారత మాజీ స్పిన్నర్ పియుష్ చావ్లా మాట్లాడుతూ కోహ్లీ, రాహుల్ మధ్య గొడవ గురించి ప్రస్తావించాడు. ‘‘ఢిల్లీ క్యాపిటల్స్ మైదానంలో ఫీల్డింగ్ ను సెట్ చేయడానికి చాలా సమయం తీసుకోవటం పట్ల కోహ్లీ అసంతృప్తిగా ఉన్నట్లు కనిపించాడు. దాని గురించి రాహుల్ వద్దకు వెళ్లి ప్రస్తావించాడు. బదులుగా.. కేఎల్ రాహుల్ విరాట్ కోహ్లీకి సమాధానం ఇచ్చాడు’’ అంటూ పియుష్ చావ్లా అన్నాడు. మొత్తానికి కోహ్లీ, కేఎల్ రాహుల్ మధ్య వివాదానికి సంబంధించిన వీడియో వైరల్ కావటంతో ఫ్యాన్స్ కొంత ఆందోళన వ్యక్తం చేస్తూ ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు.