IPL 2025: వరుణ గండం.. ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ వేదిక మార్పు..

రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరిగే వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం ఈ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సి ఉంది. అయితే, వేదికను బెంగళూరు నుంచి లక్నోకు మారింది. ఆర్సీబీ, ఎస్ఆర్ హెచ్ మ్యాచ్ కు లక్నోలోని ఏక్నా క్రికెట్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మార్పునకు ప్రతికూల వాతావరణమే కారణం. బెంగళూరు సిటీలో భారీ వర్షాలు పడుతున్నాయి. రెండు రోజులుగా అక్కడ వానలు దంచికొడుతున్నాయి. వరుణ గండం పొంచి ఉండటంతో.. బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. వేదికను బెంగళూరు నుంచి లక్నోకి షిఫ్ట్ చేసింది.

చిన్నస్వామి స్టేడియంలో జరగాల్సిన బెంగళూరు, కోల్ కతా నైట్ రైడర్స్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. కుండపోత వానతో ఈ మ్యాచ్ జరగలేదు. దీంతో మ్యాచ్ ను రద్దు చేసిన అంపైర్లు.. ఇరుజట్లకు చెరో పాయింట్ ఇచ్చారు. వర్షం కేకేఆర్ పై తీవ్ర ప్రభావం చూపింది. కీలక మ్యాచ్ రద్దు కావడంతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించాల్సి వచ్చింది.

మరోవైపు ఈ సంవత్సరం రుతుపవనాలు త్వరగా వచ్చే అవకాశం ఉన్నందున బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. మే 20 నుండి ప్రారంభమయ్యే లీగ్ దశలోని మిగిలిన మ్యాచ్‌ల కోసం ప్లేఆఫ్ దశ మాదిరిగానే, ఆట పరిస్థితులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించనున్నట్లు BCCI ప్రకటించింది.

వర్షాలు కురుస్తుండటంతో బీసీసీఐ అలర్ట్ అయ్యింది. వాన పడే అవకాశం ఉందని తెలిసి వేదికలను మార్చేసింది. ఐపీఎల్ ఫైనల్ కు సంబంధించి వేదిక మారిపోయింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం ఐపీఎల్ 2025 ఫైనల్, క్వాలిఫయర్ 2 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. జూన్ 3న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. మే 29న క్వాలిఫయర్ 1, మే 30న ఎలిమినేటర్, జూన్ 1న క్వాలిఫయర్ 2 మ్యాచులు జరగనున్నాయి. కాగా, షెడ్యూల్ ప్రకారం చివరి నాలుగు మ్యాచ్ లు కోల్ కతా, హైదరాబాద్ వేదికలుగా జరగాల్సి ఉంది. అయితే, రివైజ్డ్ షెడ్యూల్ లో మార్పులు చేసింది బీసీసీఐ. వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్లేఆఫ్స్ కోసం కొత్త వేదికలను నిర్ణయించింది.