MI vs KKR : ముంబై పై ఓటమి.. నాకేం తెలియదు.. ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియానే అడగాలి.. అజింక్యా రహానే కీలక వ్యాఖ్యలు..
పేలవ బౌలింగ్ కారణంగానే ముంబై ఇండియన్స్‌తో (MI vs KKR) జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయాం అని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు.
- Thota Vamshi Kumar
- Published On : March 30, 2026 / 08:01 AM IST
IPL 2026 Ajinkya Rahane huge comments after Kolkata Knight Riders lost to Mumbai Indians
- ముంబై ఇండియన్స్‌పై ఓటమి
- బౌలర్ల వల్లే ఓడిపోయాం
- కేకేఆర్ కెప్టెన్ రహానే కామెంట్స్
MI vs KKR : పేలవ బౌలింగ్ కారణంగానే ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిపోయాం అని కోల్‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ అజింక్యా రహానే తెలిపాడు. తమది అనుభవం లేని బౌలింగ్ దళం అని, వీరంతా ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నారన్నాడు. అందుకనే 221 లక్ష్యాన్ని సైతం కాపాడుకోలేకపోయామన్నాడు. బ్యాటర్లు చాలా బాగా ఆడారని మెచ్చుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కేకేఆర్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. కేకేఆర్ బ్యాటర్లలో రహానే (40 బంతుల్లో 67 పరుగులు), అంక్రిష్ రఘువంశీ (29 బంతుల్లో 51 పరుగులు) అర్థశతకాలు బాదారు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ మూడు, హార్దిక్ పాండ్యా ఓ వికెట్ తీశాడు. ఆ తరువాత 221 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ 19.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి అందుకుంది. ముంబై బ్యాటర్లలో ర్యాన్ రికెల్టన్ (43 బంతుత్లో 81 పరుగులు), రోహిత్ శర్మ (38 బంతుల్లో 78 పరుగులు ) అర్థశతకాలు బాదారు. కేకేఆర్ బౌలర్లలో వైభవ్ ఆరోరా, కార్తిక్ త్యాగి, సునీల్ నరైన్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
మా బౌలింగ్ విభాగానికి అనుభవం లేదు..
ఇక మ్యాచ్ అనంతరం అజింక్యా రహానే మాట్లాడుతూ.. తన గాయంపై స్పందించాడు. కాళ్ల పిక్కలు పట్టేసాయన్నాడు. ప్రస్తుతం అంతా బాగానే ఉందన్నాడు. నిజం చెప్పాలంటే ఇది చాలా కష్టంగా అనిపించిందన్నాడు. ఈ పిచ్ పై 220 నుంచి 225 పరుగులు చాలా మంచి స్కోరు అని తాను భావిస్తున్నా అని అన్నాడు. తమ జట్టు బ్యాటర్లు చాలా బాగా ఆడారని మెచ్చుకున్నాడు. అయితే.. తమ బౌలింగ్ విభాగానికి అనుభవం లేదన్నాడు. కుర్రాళ్లు ఇంకా నేర్చుకుంటున్నారన్నాడు.
ముంబై ఇండియన్స్ కు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉందని, అలాంటి వారితో ఇలాంటి బౌలింగ్ లైనప్‌తో ఆడడం నిజంగా పెద్ద గుణపాఠం అని చెప్పుకొచ్చాడు. వైభవ్ అరోరా మినహాయిస్తే.. కార్తీక్, ముజరబానీలకు ఐపీఎల్‌లో ఆడిన అనుభవం లేదన్నాడు. ఇద్దరు అనుభవజ్ఞులైన స్పిన్నర్లు ఉన్నప్పటికి కూడా ముంబై ఇండియన్స్ బ్యాటర్లు చాలా బాగా ఆడారని అన్నాడు. ఈ మ్యాచ్ నుంచి తమ బౌలర్లు చాలా నేర్చుకోవాలన్నాడు.
క్రికెట్ ఆస్ట్రేలియానే అడగాలి..
తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ.. తనకు 37 ఏళ్లే అని, తానింకా యువకుడినే అని అన్నాడు. అయితే.. కండరాలు పట్టేయడం మాత్రం కాస్త ఇబ్బంది పెడుతుందన్నాడు. ముంబైలో తేమ ఎక్కువగా ఉండడంతో ఇలా జరుగుతుందన్నాడు. ఏదీ ఏమైనప్పటికి కూడా తన బ్యాటింగ్ పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు.
ఇక ఆసీస్ ఆటగాడు కామెరూన్ గ్రీన్ బౌలింగ్ వేయడం ప్రారంభిస్తే.. తమ జట్టుకు సమతూకం లభిస్తుందన్నాడు. ప్రస్తుతం సమతూకం కోసమే ప్రయత్నిస్తున్నామన్నాడు. గ్రీన్ త్వరలోనే బౌలింగ్ చేస్తాడని ఆశిస్తున్నట్లు చెప్పాడు. గ్రీన్ ఎందుకు బౌలింగ్ చేయడం లేదనే ప్రశ్న ఎదురుకాగా.. తనకు తెలియదని, ఆ విషయం క్రికెట్ ఆస్ట్రేలియానే అడగాలని రహానే సమాధానం ఇచ్చాడు. ఏదీఏమైనప్పటికి కూడా ఈ మ్యాచ్ నుంచి చాలా నేర్చుకోవాల్సి ఉందన్నాడు.
