Virat Kohli : బెథెల్‌కు నాకు మధ్య అదే చర్చ.. విరాట్ కోహ్లీ కీలక కామెంట్స్..
ఆర్‌సీబీ విజయంలో విరాట్ కోహ్లీ (Virat Kohli) కీలక పాత్ర పోషించాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 25, 2026 / 09:02 AM IST
IPL 2026 RCB vs GT Virat Kohli Comments after PLAYER OF THE MATCH award (pic credit@ipl)
- గుజరాత్ పై ఆర్‌సీబీ విజయం
- బెంగళూరు గెలుపులో కీలక పాత్ర పోషించిన
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు
Virat Kohli : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అదరగొడుతోంది. శుక్రవారం చిన్నస్వామి వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆర్‌సీబీ విజయంలో విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అతడు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అనంతరం అతడు మాట్లాడుతూ.. ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నాడు. బౌలర్ల క్రమశిక్షణ, దేవ్‌దత్ పడిక్కల్ ప్రదర్శనల పట్ల ప్రశంసల వర్షం కురిపించాడు.
సాయి సుదర్శన్ (100; 58 బంతుల్లో 11 ఫోర్లు, 5 సిక్సర్లు) సెంచరీ చేయడంతో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 205 పరుగులు చేసింది. ఆర్‌సీబీ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్, జోష్ హేజిల్‌వుడ్, సుయాష్ శర్మలు తలా ఓ వికెట్ తీశారు.
అనంతరం విరాట్ కోహ్లీ (81; 44 బంతుల్లో 8 ఫోర్లు, 4 సిక్సర్లు), దేవ్‌దత్ పడిక్కల్ (55; 27 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్సర్లు) హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 206 పరుగుల లక్ష్యాన్ని ఆర్‌సీబీ 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు, సిరాజ్, హోల్డర్, మానవ్ సుతార్ తలా ఓ వికెట్ పడగొట్టారు.
ఈ సీజన్‌లో దేవ్‌దత్ రెండు సార్లు ఇలా
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తరువాత కోహ్లీ మాట్లాడుతూ.. తాము ఆరంభంలోనే పిచ్, పరిస్థితులను అంచనా వేయాల్సి వచ్చిందన్నాడు. ఎందుకంటే గుజరాత్ బౌలింగ్ దళం నాణ్యమైనదని అన్నాడు. అదే సమయంలో ఓ మంచి భాగస్వామ్యం ఉంటే బెంగళూరులో 200 పరుగుల లక్ష్యాన్ని ఈజీగా చేరుకోవచ్చునని తెలిపాడు. మొదటి రెండు ఓవర్లలో ఏం జరుగుతుందో చూసి ఆ తరువాత ఆటను ముందుకు తీసుకువెళ్లాలని తనకు, బెథెల్ కు మధ్య చర్చ జరిగిందన్నాడు.
ఇక పడిక్కల్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ సీజన్‌లో అతడు ఇప్పటికే రెండు సార్లు ఇలాంటి అద్భుత ఇన్నింగ్స్ లు ఆడాడని అన్నాడు. ఓ యువ ఆటగాడిలో ఇంతటి పరిణితి చూడడం చాలా అరుదు అని చెప్పుకొచ్చాడు. అతడి ఇన్నింగ్సే మ్యాచ్‌లో అసలైన తేడాను చూపించిందని చెప్పుకొచ్చాడు. దేవదత్‌తో తన భాగస్వామ్యం విజయాన్ని ఖాయం చేసిందని, ఆట గమనాన్ని మార్చి వేసిందని తెలిపాడు.
ఆర్‌సీబీ బౌలర్లపై కూడా కోహ్లీ ప్రశంసల జల్లు కురిపించాడు. గుజరాత్ ఇన్నింగ్స్ ఆరంభించిన తీరు చూసుకుంటే తమ బౌలర్లు వారిని 20 నుంచి 25 పరుగుల తక్కువ స్కోరుకే పరిమితం చేశారని చెప్పుకొచ్చాడు. పిచ్ పై స్పిన్నర్లకు పట్టు దొరకనప్పటికి కూడా బౌలర్లు క్రమశిక్షణతో బౌలింగ్ చేశారన్నాడు. పరిస్థితులను అర్థం చేసుకుని తమపై తాము నమ్మకం ఉంచి ప్రణాళికలను అమలు చేశారన్నాడు.
ఇక ఆర్‌సీబీ జట్టు కూర్పు, బెంచ్ బలం పై కోహ్లీ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశాడు. కృనాల్ పాండ్యా లాంటి ఆటగాడు జట్టులో ఉండడం తమకు అదనపు బలాన్ని ఇస్తుందన్నాడు. మొత్తంగా తమ బ్యాటింగ్, బౌలింగ్‌లో మంచి డెప్త్ ఉందన్నాడు. ఇక చిన్నస్వామి స్టేడియంలో ఆడడం తనకు ఎల్లప్పుడు ఓ మధురమైన అనుభూతి అని తెలిపాడు. ఈ సీజన్‌లో సొంత అభిమానుల మధ్య ఐదు మ్యాచ్‌లు ఆడగా.. నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించడం నిజంగా గొప్ప ఆరంభం అని కోహ్లీ తెలిపాడు.
