RR vs CSK : మేం ఓడిపోయింది అందుకే.. పెద్దగా బాధ లేదు.. సీఎస్‌కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ కామెంట్స్..
సోమవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో (RR vs CSK) చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
- Thota Vamshi Kumar
- Published On : March 31, 2026 / 07:19 AM IST
IPL 2026 Ruturaj Gaikwad comments after Chennai Super Kings lost match to Rajasthan Royals
- ఐపీఎల్ 2026లో సీఎస్‌కేకు భారీ షాక్
- ఆర్ఆర్ చేతిలో ఓటమి
- పిచ్ చాలా కఠినంగా ఉందన్న రుతురాజ్
RR vs CSK : ఐపీఎల్ 2026 సీజన్‌ను చెన్నై సూపర్ కింగ్స్ ఓటమితో ఆరంభించింది. సోమవారం గౌహతి వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిపోయింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు 19.4 ఓవర్లలో 127 పరుగులకే కుప్పకూలింది. సీఎస్‌కే బ్యాటర్లలో జామీ ఓవర్టన్ (43; 36 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. మిగిలిన వారిలో సర్ఫరాజ్ ఖాన్ (17), కార్తీక్ శర్మ (18) లు మాత్రమే రెండు అంకెల స్కోరు సాధించారు. మిగిలిన వారంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, నంద్రే బర్గర్, రవీంద్ర జడేజాలు తలా రెండు వికెట్లు పడగొట్టారు. బ్రిజేష్ శర్మ, సందీప్ శర్మ, రవి బిష్ణోయ్ లు తలా ఓ వికెట్ పడగొట్టారు.
అనంతరం వైభవ్ సూర్యవంశీ (52; 17 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లు) మెరుపు హాఫ్ సెంచరీ బాదగా, యశస్వి జైస్వాల్ (38 నాటౌట్ ; 36 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్లు) సమయోచితంగా రాణించడంతో 128 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ 12.1 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి అందుకుంది. సీఎస్‌కే బౌలర్లలో అన్షుల్ కంబోజ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
Mohammed Siraj : బిగ్‌బాస్ బ్యూటీతో హైదరాబాదీ పేసర్ డేటింగ్..! వీడియో వైరల్
సీఎస్‌కే ఓటమిపై కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ స్పందించాడు. ఆర్ఆర్ బౌలర్లు అద్భుత ప్రదర్శన చేయడంతోనే తాము ఓటమి పాలు అయ్యామని చెప్పుకొచ్చాడు. వాస్తవం చెప్పాలంటే.. ఓటమి పెద్దగా నిరాశ కలిగించలేదన్నాడు. ఆరంభంలో పిచ్ బౌలర్లకు సహకరించిందన్నాడు. ముఖ్యంగా రాజస్థాన్ పేసర్లు జోఫ్రా ఆర్చర్, బర్గర్‌లను ఎదుర్కొనడం తమకు సవాల్‌గా మారిందని తెలిపాడు. వారు అద్భుతమైన లైన్ అండ్ లెంగ్త్‌లో బౌలింగ్ చేశారన్నాడు.
పిచ్ చాలా కఠినంగా ఉంది
వీరిద్దరి తరువాత కూడా మీడియం పేసర్లను ఎదుర్కొనడం కూడా ఈ పిచ్ పై కష్టంగా ఉందన్నాడు. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించిందన్నాడు. మొత్తంగా రాజస్థాన్ బౌలర్లు చాలా చక్కగా బంతులు వేశారన్నాడు. ఇక ఏదీఏమైనప్పటికి కూడా తమ జట్టు బ్యాటింగ్‌లో ఇంకాస్త మెరుగ్గా ఆడి ఉంటే బాగుండేదన్నాడు. 150 నుంచి 160 పరుగులు చేసి ఉంటే మంచి పోటీని ఇచ్చి ఉండేవాళ్లం అని చెప్పాడు.
ఇక ప్రస్తుత రోజుల్లో ఏదీ మంచి స్కోరు అని చెప్పడం చాలా కష్టం అని అన్నాడు. అందుకనే సాధ్యమైనంత ఎక్కువ స్కోరు కోసం ప్రయత్నించాలన్నాడు. పిచ్ చాలా కఠినంగా ఉందని, అందుకనే ఫలితంపై ఏ మాత్రం నిరాశ చెందడం లేదన్నాడు. ఇక ఈ మ్యాచ్ గురించి ఇక్కడే మరిచిపోయి ముందుకు సాగుతామన్నాడు.
మరో మూడు రోజుల్లో ఇంకో మ్యాచ్ ఉందని, అందకనే అందరూ సానుకూల దృక్పథంతో ఉండేలా చూసుకోవాలని చెప్పెకొచ్చాడు. ఇక తమ జట్టులో ఎక్కువ మంది యువ ఆటగాళ్లు ఉన్నారన్నాడు. ఇది ఓ మంచి విషయం అని, ఇది వారందరికి కాస్త ఒత్తిడితో కూడుకున్న ఆరంభం అయి ఉండొచ్చునని తెలిపాడు.
PSL 2026 : బాల్ ట్యాంపరింగ్ పై కెప్టెన్ షాహీన్ అఫ్రిది కామెంట్స్.. వీడియో చూసి..
ఓ మ్యాచ్ ముగిసిన తరువాత ఆ మ్యాచ్‌లో చేసిన తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలన్నాడు. అప్పుడే ఆటగాడిగా మరింత మెరుగుపడొచ్చునని అన్నాడు. తదుపరి మ్యాచ్‌ల్లో వారి ఆట మెరుగు పడుతుందని ఆశిస్తున్నట్లు తెలిపాడు. తమది మంచి బ్యాటింగ్ లైనప్ అని, పరిస్థితులు అనుకూలిస్తే భారీ స్కోర్లు చేయగలదన్న ధీమాను వ్యక్తం చేశాడు.
