Abhishek Sharma : అభిషేక్ శర్మ ఆసక్తికర వ్యాఖ్యలు.. నాన్న స్క్రీన్ పక్కనే కూర్చుంటారు.. L సెలెబ్రేషన్స్ ఎందుకంటే..?
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న తరువాత అభిషేక్ శర్మ (Abhishek Sharma) మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
- Thota Vamshi Kumar
- Updated on- April 22, 2026 / 07:42 AM IST
IPL 2026 SRH vs DC Abhishek Sharma comments after received player of the match award (pic credit@ipl)
- ఢిల్లీ పై శతక్కొట్టిన అభిషేక్ శర్మ
- ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం
- తల్లిదండ్రులు, స్నేహితులు, ఎస్ఆర్‌హెచ్ ఫ్యాన్స్‌కు అవార్డును అంకితం ఇచ్చిన ఓపెనర్
Abhishek Sharma : ఐపీఎల్ 2026 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్ అభిషేక్ శర్మ అదరగొడుతున్నాడు. మంగళవారం ఉప్పల్ మైదానంలో ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 68 బంతుల్లోనే 10 ఫోర్లు, 10 సిక్సర్ల సాయంతో 135 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 47 పరుగుల తేడాతో ఢిల్లీపై విజయం సాధించింది. సన్‌రైజర్స్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
ఈ అవార్డు అందుకున్న తరువాత అభిషేక్ శర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. తన శతకాన్ని ఎస్ఆర్‌హెచ్ అభిమానులతో పాటు తన కుటుంబ సభ్యులు, స్నేహితులకు అంకితం ఇస్తున్నట్లుగా చెప్పాడు. ఇక మ్యాచ్ గురించి మాట్లాడుతూ.. తాము ఓ స్పష్టమైన ప్రణాళికలతో మైదానంలోకి దిగామన్నాడు. తాను, హెడ్ కలిసి పవర్ ప్లేను పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలని అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు.
Abhishek Sharma talking about the support from family & dedicated the hundred to his sister who is affected by infection. 🥹🧡 pic.twitter.com/KRjFyP5iWr
— Johns. (@CricCrazyJohns) April 21, 2026
అయితే.. ఆరంభంలో పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది. దీంతో తమ ప్రణాళికలను మార్చుకోవాల్సి వచ్చిందన్నాడు. అయినప్పటికి తాను మాత్రం ఎప్పటిలాగానే పవర్ ప్లేలో దూకుడుగా ఆడాలనే నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా తెలిపాడు. ఇక ఉప్పల్ మైదానంలో పరుగులు చేయడం ఎల్లప్పుడూ ఓ ప్ర్యతేకమైన అనుభూతి ఇస్తుందన్నాడు. ఈ విషయాన్ని గతంలో కూడా చాలా సార్లు చెప్పానన్నాడు. 20 పూర్తి అయ్యే వరకు ఏదీ సురక్షితమైన స్కోరు అనేది చెప్పలేమన్నాడు.
Ayush Mhatre : చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ షాక్..
ఏదీఏమైనప్పటికి కూడా తన మసులో ఎల్లప్పుడూ కూడా ప్రేక్షకులను అలరించాలనే ఉంటుందన్నాడు. తాను ఈ స్థాయికి ఎదగడానికి సన్‌రైజర్స్ ఇచ్చిన స్వేచ్ఛ , అవకాశాలే కారణం అని తెలిపాడు. ఇక 2024 సీజన్ ఒక గేమ్ ఛేంజర్ అని చెప్పవచ్చు. అప్పటి నుంచి జట్టులో ఉన్న వాతావరణం చాలా బాగుందన్నాడు. ఎందుకంటే మేనేజ్‌మెంట్ విజయాలే కాకుండా కుర్రాళ్లను సైతం ప్రోత్సహించాలని నిర్ణయించుకుందన్నారు.
L సెలెబ్రేషన్స్..
తాను సెంచరీ చేసిన అనంతరం చేసుకునే L సెలెబ్రేషన్స్ పై మాట్లాడుతూ.. తాను చాలా కాలంగా ఈ రకంగా సంబరాలు చేసుకుంటున్నానని తెలిపాడు. స్టేడియంలోనే కాకుండా బయట కూడా అభిమానులు ఎంతో మద్దతు ఇస్తారని, వారు ఇచ్చే ప్రేమను కాస్త అయినా తిరిగి ఇవ్వాలని అనుకుంటున్నానని, అందుకనే ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నానని చెప్పాడు.
నాన్న స్క్రీన్ పక్కనే కూర్చుంటారు..
ఈ రోజు అమ్మా, నాన్నల సమక్షంలో సెంచరీ చేయడం ఎంతో ప్రత్యేకమన్నాడు. తన సోదరికి ఇన్ఫెక్షన్ సోకడం వల్ల ఈ రోజు ఆమె మ్యాచ్‌కు రాలేకపోయిందన్నాడు. ‘ఇక నేను అండర్-12 ఆడుతున్నప్పటి నుంచి కూడా నాన్న ఎప్పుడూ స్ర్కీన్ పక్కనే కూర్చుంటారు. హైదరాబాద్‌లో కూడా ఆయన ఎప్పుడూ అక్కడే కూర్చుంటారు. నేను నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్నప్పుడల్లా, ఎలా ఆడాలో అనే విషయాన్ని సైగలతో ఆయన ఎప్పుడూ చెబుతుంటారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. వచ్చే మ్యాచ్‌ల్లో కెమెరాలు ఆయన వైపు చూపిస్తే.. ఆయన ఇచ్చే రియాక్షన్స్ చూడడం చాలా సరదాగా ఉంటుంది. తల్లిదండ్రులు, స్నేహితుల ముందు అద్భుత ప్రదర్శన ఇవ్వడం ఎల్లప్పుడూ చాలా ప్రత్యేకమైనది.’ అని అభిషేక్ శర్మ అన్నాడు.
