Lionel Messi jersey : మెస్సీ జెర్సీకి దిమ్మతిరిగే ధర.. రొనాల్డో షర్ట్ కంటే ఏకంగా ఆరు రెట్లు ఎక్కువ!
Lionel Messi jersey : మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే వద్ద భద్రపరిచిన ఫుట్‌బాల్ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది.
messi jersey auction
Lionel Messi jersey : ఫుట్‌బాల్ ప్రపంచంలో అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీ, పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో మధ్య పోటీకి ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.. వారిద్దరూ మైదానంలోకి దిగారంటే ఫుట్‌బాల్ అభిమానులకు పూనకాలు వచ్చినట్లే. మైదానంలో నువ్వానేనా అన్నట్లు పోటీపడే ఇద్దరు స్టార్ ఆటగాళ్లు.. వేలంలోనూ పోటీ పడ్డారు. అయితే, ఇందులో మెస్సీ విజయం సాధించాడు.
Also Read : Price Hike Alert : ధరలు మండుతున్నాయ్..! ఇంకా అయిపోలేదు.. అసలు కథ ముందుంది.. రెడీ అవ్వండి
మాంచెస్టర్ యునైటెడ్ జట్టు మాజీ థెరపిస్ట్ రాడ్ థార్న్‌లే వద్ద భద్రపరిచిన ఫుట్‌బాల్ వస్తువులకు వేలంలో అద్భుతమైన స్పందన లభించింది. 2012 సంవత్సరంలో బార్సింలోనా – మాంచెస్టర్ యునైటెడ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో బార్సిలోనా తరపున మెస్సీ ధరించిన జెర్సీకి ప్రస్తుతం వేలం జరిగింది. మరోవైపు.. క్రిస్టియానో రొనాల్డో జెర్సీని కూడా వేలం వేయగా.. మెస్సి జెర్సీ అత్యధిక ధర పలికింది.
మెస్సీ ధరించిన, సంతకం చేసిన 2012 బార్సిలోనా జెర్సీ 66,107 అమెరికన్ డాలర్లకు (సుమారు రూ.56.4 లక్షలు) వేలంలో విక్రయమైంది. అదే సేకరణలో ఉన్న రొనాల్డో రియల్ మాడ్రిడ్ జెర్సీ 10,601 డాలర్లకు (సుమారు రూ.9.05 లక్షలు) అమ్ముడైంది. దీంతో మెస్సీ జెర్సీ రొనాల్డో జెర్సీ కంటే ఆరు రెట్లకు పైగా ఎక్కువ ధర పలికింది.
మెస్సీ జెర్సీ 2012 ఆగస్టులో మాంచెస్టర్ యునైటెడ్‌తో జరిగిన బార్సిలోనా ప్రీ-సీజన్ స్నేహపూర్వక మ్యాచ్‌లో ఆయన ధరించినదిగా పేర్కొన్నారు. ఆ మ్యాచ్ అనంతరం మెస్సీ ఈ జెర్సీపై సంతకం చేసి.. అప్పటి మాంచెస్టర్ యునైటెడ్ మసాజర్ రాడ్ థార్నీకి ఇచ్చాడు. మ్యాచ్‌లో ధరించినదిగా ఉండటంతో పాటు మెస్సీ సంతకం ఉండటం దాని విలువను మరింత పెంచింది. రొనాల్డో జెర్సీ 2014-15 సీజన్‌కు చెందిన రియల్ మాడ్రిడ్ మ్యాచ్-ఇష్యూడ్ షర్ట్. అయితే, అది మ్యాచ్ కోసం సిద్ధం చేసినప్పటికీ రొనాల్డో స్వయంగా ధరించినది కాదని సమాచారం.
మెస్సీ జెర్సీ వెనుక ఆసక్తికర కథ ఉంది. 2012లో బార్సిలోనా జట్టు మాంచెస్టర్ యునైటెడ్‌తో ప్రీ-సీజన్ మ్యాచ్ కోసం ఇంగ్లండ్‌కు వచ్చిన సమయంలో ఈ అరుదైన ఘటన చోటుచేసుకుంది. మ్యాచ్‌కు కొన్ని రోజుల ముందే అప్పటి బార్సిలోనా డిఫెండర్ గెరార్డ్ పికేను రాడ్ థార్న్‌లే సంప్రదించాడు. మ్యాచ్ అనంతరం మెస్సీ జెర్సీని తనకు ఇప్పించాలని కోరాడు. అయితే, మ్యాచ్ ముగిసిన తర్వాత పికే స్వయంగా థార్న్లేను బార్సిలోనా డ్రెస్సింగ్ రూమ్‌కు తీసుకెళ్లాడు. అప్పటికి మెస్సీ అదే జెర్సీని ధరించి ఉన్నాడు. అనంతరం మెస్సీ తన జెర్సీని తీసి, దానిపై సంతకం చేసి థార్న్లేకు స్వయంగా అందించాడు. అంతేకాకుండా అతడితో కరచాలనం చేశాడు. ఈ అనూహ్యమైన అనుభవాన్ని తన జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని థార్న్‌లే గుర్తుచేసుకున్నాడు.
థార్న్‌లే అభిప్రాయం ప్రకారం.. ఈ జెర్సీ విలువ కేవలం మెస్సీ ధరించడంలోనే లేదు. మ్యాచ్‌లో స్వయంగా ధరించిన జెర్సీ కావడం, మెస్సీ సంతకం ఉండటం, అలాగే బార్సిలోనా-మాంచెస్టర్ యునైటెడ్ మధ్య జరిగిన ఆ ప్రత్యేక సందర్భానికి గుర్తుగా నిలవడం దీని ప్రత్యేకతను మరింత పెంచాయి. అందుకే వేలంలో ఈ జెర్సీకి భారీ డిమాండ్ ఏర్పడిందని ఆయన వివరించాడు.
