ఐపీఎల్ 2020 వేలంలో అత్యంత ధర పలికిన ఆటగాళ్లలో ఆస్ట్రేలియన్ ఫాస్ట్ బౌలర్ ప్యాట్ కమిన్స్ రికార్డు సృష్టించాడు. గురువారం జరిగిన వేలంలో కోల్ కతా నైట్ రైడర్స్ ఫ్రాంచైజీ.. కమిన్స్‌ను రూ.15.5 కోట్లకు సొంతం చేసుకుంది. నిజానికి కమిన్స్ కనీస ధర కేవలం రూ.2 కోట్లు మాత్రేమే. అయినప్పటికీ కోల్‌కతా.. ఈసారి వేలంలో కమిన్స్ కోసం అధిక మొత్తంలో వెచ్చించి కొనుగోలు చేసింది.
దీంతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ధర పలికిన విదేశీ ఆటగాడిగా కమిన్స్ అవతరించాడు. రూ. 14.5 కోట్లతో ఉన్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌ను వెనక్కి నెట్టేసి కమిన్స్ టాప్‌లో నిలిచాడు. 2017 ఐపీఎల్ వేలంలో స్టోక్స్‌ను రైజింగ్ పుణె సూపర్ గెయింట్ రూ.14.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఇతర విదేశీ ఆటగాళ్లలో అత్యంత ధర పలికిన వారిలో ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మ్యాక్స్ వెల్ కనీస ధర రూ.2 కోట్లు ఉండగా.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ అతన్ని రూ.10.75 కోట్లకు కొనుగోలు చేసింది. మరోవైపు.. ఐపీఎల్ 2020 వేలంలో దక్షిణాఫ్రికా క్రిస్ మోరీస్ కనీస ధర రూ.1.5 కోట్లు ఉంటే.. అతన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) రూ.10 కోట్లకు కొనుగోలు చేసింది. ఇంగ్లాండ్ సామ్ కురెన్ రూ.5.5 కోట్లతో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) దక్కించుకుంది.
ఇక ఢిల్లీ క్యాపిటల్స్ క్రిస్ వోక్స్ ను రూ.1.5 కోట్లతో దక్కించుకోగా, అరోన్ పించ్ ను కనీస ధర రూ.కోటి దాటేసి RCB రూ.4.4 కోట్లతో కొనుగోలు చేసింది. ఐపీఎల్ వేలంలో ఇతర ఆటగాళ్లలో స్టార్ట్ బిన్నీ, యూసఫ్ పటాన్, కొలియన్ డి గ్రాండ్ హోమ్‌లను కొనేందుకు ప్రాంఛైజీలు ఆసక్తి చూపలేదు.