Ipl2022 Rr Vs Mi
IPL2022 RR Vs MI : ఐపీఎల్ 2022 సీజన్ 15-లో భాగంగా నేడు రాజస్తాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ జట్లు తలపడ్డాయి. డీవై పాటిల్ స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ పై రాజస్తాన్ రాయల్స్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్తాన్ రాయల్స్ 193 పరుగుల భారీ స్కోర్ చేసింది. 194 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై.. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు మాత్రమే చేసింది. దీంతో రాజస్తాన్ జట్టు 23 పరుగుల తేడాతో గెలుపొందింది.
ముంబై బ్యాటర్లలో తిలక్ వర్మ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీ బాదాడు. 33 బంతుల్లోనే 61 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 సిక్సులు, మూడు ఫోర్లు ఉన్నాయి. ఓపెనర్ ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీతో రాణించాడు. 43 బంతుల్లో 54 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 5 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. కెప్టెన్ రోహిత్ శర్మ(10), కీరన్ పొలార్డ్(22) పరుగులు చేశారు. 194 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ముంబై.. రాజస్తాన్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో 170/8 స్కోరుకే పరిమితమైంది. కీరన్ పొలార్డ్ (22) ఆఖరి బంతికి ఔటయ్యాడు. ముంబై బ్యాటర్లలో అన్మోల్ ప్రీత్ సింగ్ (5), టిమ్ డేవిడ్ (1), డేనియల్ సామ్స్ (0) విఫలమయ్యారు.(IPL2022 RR Vs MI)
IPL 2022: “ఒక్క ఇన్నింగ్స్‌తో బదోనీ సూపర్ స్టార్ అయిపోడు”
రాజస్తాన్ బౌలర్లలో యజువేంద్ర చాహల్, నవదీప్ సైనీ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. రవిచంద్రన్ అశ్విన్, ప్రసిద్ధ్ కృష్ణ, ట్రెంట్ బౌల్ట్ తలో వికెట్ తీశారు. ఈ మెగా టోర్నీలో రాజస్తాన్ కి ఇది రెండో విజయం. కాగా, ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ కి మాత్రం వరుసగా రెండో ఓటమి.
స్వల్ప వ్యవధిలో కీలక వికెట్లు డౌన్..
ట్రెంట్ బౌల్ట్ వేసిన 13వ ఓవర్లో మూడో బంతిని బౌండరీకి తరలించి హాఫ్ సెంచరీ మార్క్‌ను చేరుకున్న ఇషాన్ కిషన్.. అదే ఓవర్లో ఆఖరు బంతికి బౌండరీ లైన్ దగ్గర నవదీప్ సైనికి చిక్కాడు. అంతకు ముందు రియాన్ పరాగ్ వేసిన 12వ ఓవర్లో ఓ సిక్స్ బాదిన తిలక్ వర్మ (61).. 14వ ఓవర్లో తొలి బంతికి సింగిల్ తీసి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ వేసిన 15వ ఓవర్లో తొలి బంతిని సిక్స్‌గా మలిచిన తిలక్ వర్మ.. రెండో బంతికి బౌల్డయ్యాడు.(IPL2022 RR Vs MI)
ఫస్ట్ మ్యాచ్ ఆడిన సేమ్ టీమ్ తోనే బరిలోకి దిగింది ముంబై ఇండియన్స్. ఇక, రాజస్తాన్ రాయల్స్ జట్టు ఒక మార్పుతో బరిలోకి దిగింది. గాయపడ్డ నాథన్ కౌల్టర్ నైల్ స్థానంలో యంగ్ పేసర్ నవదీప్ సైనీకి తుది జట్టులో చోటు కల్పించింది. తన తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఓడిపోయిన విషయం తెలిసిందే. ఢిల్లీ కేపిటల్స్ చేతిలో చిత్తుగా ఓడింది. ఇప్పుడు రాజస్తాన్ రాయల్స్ చేతిలోనూ పరాజయం పాలైంది.
ప్రస్తుతం పాయింట్ల పరంగా కింది స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ రాజస్తాన్ తో మ్యాచ్‌లో గ్రాండ్ విక్టరీ కొట్టి.. తన స్థానాన్ని మెరుగుపర్చుకోవాలనుకుంది. కానీ ఓటమే ఎదురైంది. మరోవైపు రాజస్తాన్ రాయల్స్.. సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 61 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని సాధించి.. ఈ సీజన్ ను ఘనంగా ప్రారంభించింది. ఇదే దూకుడుని ముంబైతో జరిగిన మ్యాచ్ లో కంటిన్యూ చేసింది.
IPL 2022: డివిలియర్స్ రికార్డుకు సమం చేసిన ఎంఎస్ ధోనీ
హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే.. ముంబై ఇండియన్స్, రాజస్తాన్ రాయల్స్ జట్ల మధ్య మొత్తం 25 మ్యాచులు జరగ్గా 13 మ్యాచుల్లో ముంబై ఇండియన్స్ గెలిచింది. 11 మ్యాచుల్లో రాజస్తాన్ గెలుపొందింది. ఓ మ్యాచ్‌లో ఫలితం తేలలేదు.
జట్ల వివరాలు :
ముంబయి: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అన్మోల్ ప్రీత్ సింగ్, తిలక్ వర్మ, కీరన్ పొలార్డ్, టిమ్ డేవిడ్, డేనియల్ సామ్స్, మురుగన్ అశ్విన్, జస్ప్రీత్ బుమ్రా, టైమల్ మిల్స్, బాసిల్ థంపి
రాజస్థాన్: జోస్ బట్లర్, యశస్వీ జైస్వాల్, సంజూ శాంసన్ (కెప్టెన్), దేవదత్ పడిక్కల్, షిమ్రోన్ హెట్‌మయర్, రియాన్ పరాగ్, రవిచంద్రన్ అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, ట్రెంట్ బౌల్ట్, నవ్‌దీప్ సైని, ప్రసిద్ధ్ధ్ కృష్ణ
స్కోర్లు..
రాజస్తాన్ రాయల్స్-193/8
ముంబై ఇండియన్స్-170/8