Jasprit Bumrah Becomes The Most Successful T20I Bowler Against Australia
Jasprit Bumrah : టీమ్ఇండియా స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో ఆస్ట్రేలియాపై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. గురువారం క్వీన్స్‌లాండ్ వేదికగా ఆసీస్‌తో జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో ఓ వికెట్ పడగొట్టడం ద్వారా బుమ్రా (Jasprit Bumrah) ఈ ఘనత అందుకున్నాడు. ఈ క్రమంలో అతడు పాకిస్తాన్ మాజీ స్పిన్నర్ సయీద్ అజ్మల్ ను అధిగమించాడు.
ఆసీస్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌ల్లో అజ్మల్ 11 ఇన్నింగ్స్‌ల్లో 19 వికెట్లు తీశాడు. ఇక బుమ్రా 17 ఇన్నింగ్స్‌ల్లో 20 వికెట్లు సాదించాడు. ఈ జాబితాలో వీరిద్దరి తరువాతి స్థానాల్లో పాక్ ఆటగాడు మహ్మద్ అమీర్, న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ సాంట్నర్ ఉన్నారు.
టీ20ల్లో ఆసీస్ పై అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..
* జస్‌ప్రీత్ బుమ్రా (భారత్) – 20 వికెట్లు (17 ఇన్నింగ్స్‌ల్లో)
* సయీద్ అజ్మల్ (పాకిస్తాన్) – 19 వికెట్లు (11 ఇన్నింగ్స్‌ల్లో)
* మహ్మద్ అమీర్ (పాకిస్తాన్) – 17 వికెట్లు (10 ఇన్నింగ్స్‌ల్లో)
* మిచెల్ సాంట్నర్ (న్యూజిలాండ్) – 17 వికెట్లు (12 ఇన్నింగ్స్‌ల్లో )
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (46), అభిషేక్ శర్మ (28), శివమ్ దూబె (22), అక్షర్ పటేల్ (21 నాటౌట్) రాణించారు. ఆసీస్ బౌలర్లలో ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్‌లు చెరో మూడు వికెట్లు తీశారు. జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టోయినిస్ తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం 168 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (30), మాథ్యూ షార్ట్ (25) లు పర్వాలేనిపించగా.. జోష్ ఇంగ్లిష్ (12), టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10), గ్లెన్ మాక్స్‌వెల్ (2)లు విఫలం అయ్యారు. టీమ్ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లు, అక్షర్ పటేల్, శివమ్ దూబెలు చెరో రెండు వికెట్లు తీశారు. వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా లు తలా ఓ వికెట్ పడగొట్టారు.