Gambhir : ఐపీఎల్ ఫైన‌ల్‌లో కేకేఆర్ విజ‌యం.. గంభీర్‌తో జైషా సుదీర్ఘ సంభాష‌ణ‌.. టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వి గురించేనా?

ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు పై కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

Gambhir – Jay Shah : చెపాక్ వేదిక‌గా ఆదివారం రాత్రి జ‌రిగిన ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్‌లో స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టు పై కోల్‌క‌తా నైట్‌రైడ‌ర్స్ ఎనిమిది వికెట్ల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. దీంతో మూడోసారి కేకేఆర్ జ‌ట్టు ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడింది. ఐపీఎల్ 17వ సీజ‌న్‌లో విజేత‌గా నిల‌వ‌డంతో కేకేఆర్ ఆట‌గాళ్లు సంబ‌రాలు చేసుకున్నారు. కోల్‌క‌తా క‌ప్పును గెల‌వ‌డంలో ఆ జ‌ట్టుకు మెంటార్‌గా వ్య‌వ‌హ‌రించిన గౌత‌మ్ గంభీర్ కీల‌క పాత్ర పోషించాడు. ఆట‌గాళ్ల సంబ‌రాల్లో గంభీర్ సైతం పాల్గొన్నాడు.

కొద్ది సేప‌టి త‌రువాత గంభీర్ సంబురాల మ‌ధ్య‌లోంచి బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అనంత‌రం మ్యాచ్‌కు హాజ‌రైన బీసీసీఐ సెక్ర‌ట‌రీ జైషాను క‌లుసుకున్నాడు. వీరిద్ద‌రు చాలా సేపు మాట్లాడుకున్నారు. టీమ్ఇండియా హెడ్ కోచ్ ప‌ద‌వికి గంభీర్ ఎన్నిక కానున్నాడు అని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో వీరిద్ద‌రి భేటి ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

టీ20 ప్ర‌పంచ‌క‌ప్ 2024తో ప్ర‌స్తుత హెడ్ కోచ్‌ రాహుల్ ద్ర‌విడ్ ప‌ద‌వికాలం ముగియ‌నుంది. ద్ర‌విడ్ మ‌ళ్లీ ఆ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డంతో బీసీసీఐ హెడ్ కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానించింది. కొత్త కోచ్ 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసే వ‌ర‌కు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఆట‌గాళ్లు రికీ పాంటింగ్‌, జ‌స్టిన్ లాంగర్‌లు కోచ్ ప‌ద‌వికి ద‌ర‌ఖాస్తు చేసుకుంటార‌నే వార్త‌లు రాగా వీరిద్ద‌రు వాటిని తిర‌స్క‌రించారు.

అదే స‌మ‌యంలో ఆసీస్ ఆట‌గాళ్ల‌ను ఎవ్వ‌రిని ఇప్ప‌టి వ‌ర‌కు సంప్ర‌దించ‌లేద‌ని, భార‌త క్రికెట్ నిర్మాణం గురించి పూర్తిగా తెలిసిన వ్య‌క్తే హెడ్ కోచ్ గా బాధ్య‌త‌లు చేప‌డుతాడ‌ని జైషా స్ప‌ష్టం చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో హెడ్ కోచ్ రేసులో గంభీర్ మొద‌టి స్థానంలో ఉన్నాడ‌నే వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఐపీఎల్ ఫైన‌ల్ మ్యాచ్ లో కేకేఆర్ విజ‌యం అనంత‌రం గంభీర్‌తో జైషా చాలా సేపు మాట్లాడ‌డం.. ఈ ఊహాగానాల‌కు మ‌రింత బ‌లం చేకూరిన‌ట్లైంది.

ట్రెండింగ్ వార్తలు