×
Ad

వరల్డ్ కప్ ముందు సౌతాఫ్రికా క్రికెటర్ రిటైర్మెంట్

వరల్డ్ కప్‌కు ముందు దక్షిణాఫ్రికా క్రికెటర్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. జేపీ డుమిని రిట్మైర్మెంట్ అవనున్నట్లు ప్రకటించాడు. ఇంగ్లాండ్ వేదికగా మే30 నుంచి మొదలుకానున్న టోర్నీయే అతని వన్డే ప్రొఫెషనల్ కెరీర్‌కు ఆఖరి మ్యాచ్ అని తెలిపాడు. వన్డే ఫార్మాట్ వీడ్కోలు చెప్పినప్పటికీ టీ20లలో కొనసాగుతానని చెప్పాడు. 

లాంగ్ ఫార్మాట్ అయిన టెస్టు క్రికెట్‌కు 2017లోనే రిటైర్మెంట్‌ ప్రకటించిన డుమిని ఆఖరి వరల్డ్ కప్‌లో రాణించాలని ఆశపడుతున్నాడు. ఇదే సందర్భంలో మాట్లాడిన డుమిని ‘కొన్నినెలలుగా వన్డే రిటైర్మెంట్‌ గురించి  ఆలోచించా. ఇక వన్డేలకు గుడ్‌ బై చెప్పాల్సిన సమయం వచ్చిందనుకుంటున్నా. వరల్డ్‌కప్‌ తర్వాత తప్పుకోవాలని నిశ్చయించుకున్నా. కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలనే ఈ నిర్ణయం తీసుకున్నా. అంతర్జాతీయ, దేశీవాళీ టీ20ల్లో కొనసాగుతా’ అని డుమిని తెలిపాడు.

గతంలో 2011, 2015 వరల్డ్‌కప్‌ టోర్నీలలో దక్షిణాఫ్రికాకు ప్రాతినిధ్యం వహించిన డుమినికి ఇది మూడో అవకాశం. ఇప్పటివరకూ డుమిని 193 వన్డేలు ఆడి 5,047 పరుగులు చేశాడు. బౌలింగ్‌లో మాత్రం 68 వికెట్లు తీయగలిగాడు. 2019 సీజన్ కు ముందుగానే ముంబై ఇండియన్స్‌ డుమినిని విడుదల చేసింది. వేలంలో అతన్ని ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేసేందుకు ఆసక్తి కనబర్చలేదు.