Karnataka deny fans entry at Chinnaswamy stadium for Kohli VHT return match
Virat Kohli : కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగరంలోని చిన్నస్వామి స్టేడియంలో దాదాపు ఏడు నెలల తరువాత ఓ మ్యాచ్ జరగనుంది. విజయ్ హజారే ట్రోఫీ 2025-26 లో భాగంగా చిన్నస్వామి స్టేడియం తొమ్మిది లీగ్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్ ఆంధ్ర-ఢిల్లీ జట్ల మధ్య డిసెంబర్ 24న జరగనుంది.
ఇందులో ఢిల్లీ జట్టు తరుపున విరాట్ కోహ్లీ (Virat Kohli ), రిషబ్ పంత్ వంటి టీమ్ఇండియా స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. ఈ క్రమంలో వీరిని ప్రత్యక్ష్యంగా చూడొచ్చని భావించిన అభిమానులకు కర్ణాటక ప్రభుత్వం షాకిచ్చింది. ఈ మ్యాచ్‌లకు ప్రేక్షకులను ఎట్టి పరిస్థితుల్లో అనుమతించ కూడదని చెప్పింది. దీంతో ఫ్యాన్స్ లేకుండానే మ్యాచ్‌లను నిర్వహించనున్నారు.
వాస్తవానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ ఈ మ్యాచ్‌లకు రెండు నుంచి మూడు వేల మంది ఫ్యాన్స్‌కు అనుమతించాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై కర్ణాటక ప్రభుత్వానికి నివేదించింది. అయితే.. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం తిరస్కరించినట్లు తెలుస్తోంది.
అప్పటి విషాదమే కారణం..
ఐపీఎల్ 2025 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిలిచింది. విజేతగా నిలిచిన తరువాత ఆర్‌సీబీ చిన్నస్వామి స్టేడియం వద్ద విజయోత్సవ ర్యాలీని నిర్వహించింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఫ్యాన్స్ గాయపడ్డారు. ఈ ఘటన తరువాత చిన్నస్వామి స్టేడియంలో ఎలాంటి మ్యాచ్‌లను నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
అయితే.. ఇటీవల కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ విజ్ఞప్తి మేరకు మ్యాచ్‌ల నిర్వహణకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.