కరుణ్ నాయర్ పవర్ ప్యాక్ బ్యాటింగ్‌.. ఈసారైనా ఐపీఎల్ ఆడతాడా?

ఐపీఎల్ 2025 వేలానికి కొద్ది నెలల ముందు కరుణ్ నాయర్ సత్తా చాటడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. అతడు చివరిసారిగా 2022లో ఐపీఎల్ ఆడాడు.

Karun Nair reached his century in just 43 balls

Karun Nair century: బెంగళూరు వేదికగా జరుగుతున్న మహరాజ్ టీ20 ట్రోఫీ 2024లో రాజస్థాన్ రాయల్స్ మాజీ బ్యాటర్ కరుణ్ నాయర్ చెలరేగిపోయాడు. చాలా కాలం తర్వాత సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. మైసూరు వారియర్స్, మంగళూరు డ్రాగన్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అజేయ సెంచరీతో వీర విహారం చేశాడు. మైసూరు వారియర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న నాయర్ పవర్ ప్యాక్ బ్యాటింగ్‌తో జట్టును గెలిపించాడు. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన మైసూరు వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. నాయర్ 48 బంతుల్లోనే 9 సిక్స్‌లు, 13 ఫోర్లతో అజేయంగా 124 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.

ఓపెనర్ అజిత్ కార్తీక్(11) అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన నాయర్ బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 26 బంతుల్లో సిక్సర్ తో హాఫ్ సెంచరీ పూర్తి చేసిన తర్వాత కూడా జోరు కొనసాగించాడు. చివరి ఓవర్లో మూడు సిక్సర్లు కొట్టి 43 బంతుల్లో సెంచరీ సాధించాడు. మనోజ్ భాండాగే 31, ఎస్ యూ కార్తీక్ 23, సమిత్ ద్రవిడ్ 16, సమిత్ కుమార్ 15 పరుగులు చేశారు. మంగళూరు డ్రాగన్స్‌ బౌలర్లో అభిలాష్ శెట్టి 2 వికెట్లు తీశాడు. నిశ్చిత్ రావు, ఎంబీ దర్శన్ చెరో వికెట్ దక్కించుకున్నారు.

వర్షం కారణంగా మ్యాచ్ కుదించడంతో మంగళూరు డ్రాగన్స్‌ టీమ్‌కు 14 ఓవర్లలో 166 పరుగుల టార్గెట్ విధించారు. కృష్ణమూర్తి సిద్ధార్థ్ హాఫ్ సెంచరీతో పోరాటం చేసినా మంగళూరుకు ఓటమి తప్పలేదు. నిర్ణీత 14 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసి 27 పరుగుల తేడాతో ఓటమిపాయింది. సిద్ధార్థ్ 27 బంతుల్లో 9 ఫోర్లు, సిక్సర్‌తో 50 పరుగులు చేశాడు. నికిన్ జోస్ 32, రోహన్ పాటిల్ 12, ఎంబీ దర్శన్ 12 పరుగులు చేశారు. మైసూరు వారియర్స్ బౌలర్లలో అజిత్ కార్తీక్, జగదీశ సుచిత్ రెండేసి వికెట్లు పడగొట్టారు. విద్యాధర్ పాటిల్, దీపక్ దేవడిగ చెరో వికెట్ తీశారు.

Also Read: స‌మిత్ ద్ర‌విడ్ ఇన్‌సైడ్ ఔట్ షాట్ చూశారా..? ద్ర‌విడ్ కొడుకు ప‌వ‌ర్ హిట్ట‌రే..!

ఈసారైనా ఐపీఎల్ ఆడతాడా?
కాగా, ఐపీఎల్ 2025 వేలానికి కొద్ది నెలల ముందు కరుణ్ నాయర్ సత్తా చాటడంతో ఆశలు రేకెత్తుతున్నాయి. అతడు చివరిసారిగా 2022లో ఐపీఎల్ ఆడాడు. రూ. 50 లక్షల బేస్ ధర ఉన్నప్పటికీ అతడిని కొనేందుకు ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో అజేయ సెంచరీతో మరోసారి వెలుగులోకి రావడంతో ఈసారైనా ఐపీఎల్ వేలంలో నాయర్‌ను కొనేందుకు ఫ్రాంచైజీలు ముందుకొస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, కర్ణాటక క్రికెట్ బోర్డు నిర్వహిస్తున్న మహరాజ్ టీ20 ట్రోఫీలో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి బ్యాటర్‌గా కరుణ్ నాయర్ గుర్తింపు సాధించాడు.

 

ట్రెండింగ్ వార్తలు