Champions Trophy: కోహ్లీ 300వ మ్యాచ్‌ వేళ కేఎల్‌ రాహుల్‌ ప్రశంసల జల్లు.. ఎంతటి గొప్ప ఆటగాడో అంటూ..

ఆదివారం న్యూజిలాండ్‌, ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది.

న్యూజిలాండ్‌తో టీమిండియా మార్చి 2న దుబాయ్ వేదిక‌గా మ్యాచ్ ఆడనుంది. ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా జరుగుతున్న ఈ మ్యాచుతో టీమిండియా బ్యాటర్ విరాట్ కోహ్లీ 300వ మ్యాచ్‌ను పూర్తి చేసుకోనున్నాడు. బ్యాటింగ్ దిగ్గజాలు, మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, ఎంఎస్ ధోనీ వంటి ఎలైట్ ఇండియా స్టార్స్ జాబితాలో కోహ్లీ చేరనున్నాడు.

దీనిపై భారత ఆటగాడు కేఎల్‌ రాహుల్ స్పందించాడు. క్రికెట్‌లో 300 వన్డే మ్యాచులు ఆడడమంటే చాలా ఎక్కువ అని అన్నాడు. కోహ్లీ ఎంతటి గొప్ప ఆటగాడో చెప్పడానికి మాటలు సరిపోవని చెప్పాడు. భారత క్రికెట్‌కు అతడు గొప్ప సేవలు అందించాడని తెలిపాడు.

Champions Trophy: వర్షం వల్ల అఫ్ఘాన్‌తో మ్యాచు రద్దు.. ఆస్ట్రేలియా సెమీస్‌ బెర్త్ ఖరారు.. నెక్స్ట్‌ ఏంటంటే?

పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచులో కోహ్లీ సెంచరీ చేయడం తనకు కూడా చాలా సంతోషాన్ని ఇచ్చిందని అన్నాడు. చాలా అద్భుతంగా ఆడుతున్నాడని చెప్పాడు. మ్యాచ్‌ విన్నింగ్‌ సెంచరీ చేశాడని ప్రశంసల జల్లు కురిపించాడు. జట్టులో రోహిత్ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌, విరాట్ కోహ్లీ మంచి ఫామ్‌లో ఉన్నారని చెప్పాడు. శ్రేయాస్ కూడా బాగా ఆడాడని తెలిపాడు.

కాగా, శనివారం ఛాంపియ‌న్స్ ట్రోఫీ 2025లో భాగంగా దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఆదివారం న్యూజిలాండ్‌, ఇండియా మధ్య మ్యాచ్ జరుగుతుంది. తదుపరి రెండు సెమీఫైనల్స్, అనంతరం ఫైనల్‌ ఉంటుంది. టీమిండియాలో కోహ్లీతో పాటు మరికొందరు ఆటగాళ్లు మంచి ఫామ్‌లో ఉండడంతో పరుగుల వరద పారుతుందని ఫ్యాన్స్‌ ఆశిస్తున్నారు.