Kl Rauhl comments after Team India win 1st ODI against New Zealand
Kl Rauhl : ఆల్‌రౌండర్ హర్షిత్ రాణా అద్భుతంగా ఆడాడని, అతడు ఆడిన షాట్ల కారణంగానే తన పై ఒత్తిడి తగ్గిందని చెప్పాడు టీమ్ఇండియా వికెట్ కీపర్, బ్యాటర్ కేఎల్ రాహుల్. దీంతో లక్ష్య ఛేదన చాలా సులభమైందని అన్నాడు. మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భాగంగా వడోదర వేదికగా జరిగిన తొలి వన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ పై భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఆఖరి వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ 21 బంతులను ఎదుర్కొని 2 ఫోర్లు, ఓ సిక్స్ బాది 29 పరుగులతో అజేయంగా నిలిచి భారత్ కు విజయాన్ని అందించాడు.
మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. హర్షిత్ రాణా పై ప్రశంసల వర్షం కురిపించాడు. నిజానికి ఆఖరి నాలుగు నుంచి ఐదు ఓవర్లలో పెద్దగా ఒత్తిడి లేదన్నాడు. అందుకు కారణం హర్షిత్ రాణా అని తెలిపాడు. హర్షిత్ క్రీజులోకి వచ్చిన వెంటనే హిట్టింగ్ చేయడం వల్ల తన పని సులువు అయిందని చెప్పుకొచ్చాడు.
ఇక లక్ష్యం కూడా మరీ పెద్దది కాకపోవడంతో తాను ప్రశాంతంగా ఆడినట్లుగా తెలిపాడు. సాధారణంగా లక్ష్యఛేదనలో 90 శాతం మ్యాచ్‌ల్లో ఓవర్‌కు 6 నుంచి 7 పరుగులు చేయాల్సి ఉన్నా కూడా చేయొచ్చునని చెప్పాడు. మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ పరిగెత్తలేడనే విషయం తనకు తెలియదన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో అతడికి గాయమైందని తెలుసు అని, కానీ దాని తీవ్రత గురించి తనకు తెలియదన్నాడు.
ఏదీ ఏమైనప్పటికి కూడా వాషీ బంతిని బాగా టైమింగ్ చేశాడన్నారు. ఇక డాట్ బాల్స్ పెరగకుండా బంతికో పరుగు చొప్పున తీశామని తెలిపాడు. క్రీజులోకి వచ్చిన ప్రతీ ఒక్కరు కూడా చక్కని సహకారం అందించారన్నారు. ఇక పిచ్ కూడా 100 ఓవర్ల పాటు ఒకేలా స్పందించిందని తెలిపాడు. ఇక కొత్త బంతితో ఈ పిచ్ పై బ్యాటింగ్ చేయడం చాలా ఈజీగా అనిపించిందన్నాడు.
లక్ష్య ఛేదనలో రోహిత్, శుభ్‌మన్‌తో ఇన్నింగ్స్ ఆరంభించిన విధానం, ఆ తరువాత గిల్, విరాట్ లకు మధ్య భాగస్వామ్యం మ్యాచ్‌కు సరైన పునాది వేశాయని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత పిచ్ నెమ్మదించినప్పటికి కూడా టాప్ ఆర్డర్ బ్యాటర్లు చక్కగా ఆడడంతో తమ పని సులువు అయిందని రాహుల్ చెప్పాడు.
IND vs NZ : అందుకే మేం ఓడిపోయాం.. ఆ ఒక్క పని చేసుంటేనా.. కివీస్ కెప్టెన్ బ్రేస్‌వెల్ కామెంట్స్
గత కొన్నేళ్లుగా న్యూజిలాండ్‌తో చాలా ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి. ఏ దశలో ఉన్నా సరే వారు విజయం కోసం ఆఖరి వరకు పోరాడతారు. ఇదే మ్యాచ్‌లను ఆసక్తికరంగా మారుస్తుంది అని రాహుల్ అన్నాడు.