Lara crowns his successors picks 2 indian youngster break 400 run marathon
Brian Lara : వెస్టిండీస్ దిగ్గజ ఆటగాడు బ్రియాన్ లారా తన కెరీర్‌లో ఎన్నో ఘనతలను సొంతం చేసుకున్నాడు. టెస్టు క్రికెట్ మ్యాచ్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన రికార్డు ఇందులో ఒకటి. 2004లో ఇంగ్లాండ్ పై 400 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. లారా ఈ రికార్డు సాధించి ఇప్పటి 20 సంత్సరాలు పూర్తి అయ్యాయి. ఇప్పటి వరకు ఈ రికార్డు అతడి పేరిటే ఉండడం విశేషం. ప్రస్తుతం టీ20ల హవా నడుస్తోంది. టెస్టులపై ఆటగాళ్లు ఆసక్తి చూపించడం లేదు. ఈ తరుణంలో టెస్టుల్లో లారా రికార్డు బద్దలు కొట్టడం దాదాపుగా అసాధ్యమనేది క్రికెట్ పండితులు అభిప్రాయం.
కాగా.. దీనిపై లారా స్పందించాడు. తన రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఆధునిక క్రికెటర్లలో ఓ నలుగురికి ఉందని అతడు అభిప్రాయపడ్డాడు. ఇందులో ఇద్దరు భారత్‌కు చెందిన వారు కాగా మరో ఇద్దరు ఇంగ్లాండ్‌కు చెందిన ఆటగాళ్లు ఉండడం విశేషం. తాను క్రికెట్ ఆడే రోజుల్లో వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఇంజమామ్ ఉల్ హక్, సనత్ జయసూర్య వంటి ఆటగాళ్లు చాలా వేగంగా ఆడేవారని అన్నాడు. వారు తన రికార్డును బద్దలు కొట్టే అవకాశం ఉందని భావించినట్లు చెప్పుకొచ్చాడు. అయితే అది జరగలేదన్నాడు. కాగా.. టెస్టుల్లో వీరంతా 300 పై చిలుకు స్కోరు సాధించారు. ఇందులో టీమ్ఇండియా విధ్వంసకర ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ రెండు సార్లు ట్రిపుల్ సెంచరీలు చేయడం గమనార్హం.
రికార్డులు అన్నాక బద్దలు అవుతుంటాయని లారా చెప్పాడు. 10 ఏళ్ల క్రితం సచిన్ 49 వన్డే సెంచరీల రికార్డు బద్దలు కొట్టే అవకాశం లేదని అంతా భావించారు. అయితే.. విరాట్ కోహ్లి దీన్ని సాధించాడు. అలాగే లారా 400 పరుగుల రికార్డు, సచిన్ 100 సెంచరీల రికార్డును సైతం ఎవరో ఒకరు ఖచ్చితంగా బ్రేక్ చేస్తారు. ప్రస్తుతానికి ఇది అసంభవం లాగానే కనిపిస్తుంది కానీ ఏదో ఒకరోజు రికార్డులు బద్దలు కావడం ఖాయం అని లారా అన్నాడు.
ప్రస్తుతం జట్లు అన్ని కూడా డ్రా కంటే విజయాల కోసం ఎక్కువగా ఆడుతున్నాయి. కాబట్టి ఓ బ్యాటర్ 400 పరుగులు చేసే అవకాశం చాలా తక్కువగా ఉంది. అయితే.. క్రికెట్ అంటేనే ఊహాలకు అందనిది కాబట్టి.. ఎవ్వరు అయినా సరే దాన్ని సాధించొచ్చు. ఆధునిక ఆటగాళ్లలలో తన రికార్డును టీమ్ఇండియా యువ ఆటగాళ్లు శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్ అదే విధంగా బజ్‌బాల్ క్రికెట్ ఆడుతున్న ఇంగ్లాండ్ జట్టులో జాక్ క్రాలే, హ్యారీ బ్రూక్ బ్రేక్ చేసే అవకాశం ఉన్నట్టుగా చెప్పారు.
భారత క్రికెటర్ల విషయానికి వస్తే.. లారా రికార్డును యశస్వి జైసాల్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ 700 కి పైగా పరుగులు చేశాడు. లాంగ్ ఇన్నింగ్స్ ఆడగల సామర్థ్యం అతడి సొంతం. ఇప్పటికే రెండు డబుల్ సెంచరీలు చేశాడు. తన అరంగ్రేట టెస్టు మ్యాచ్‌లోనే 171 పరుగులు చేశాడు. ఇక అతడు మూడు టెస్టు సెంచరీలు చేయగా ఆ మూడు కూడా 150 ఫ్లస్ పరుగులు చేయడం గమనార్హం. ఇక గిల్ విషయానికి వస్తే టెస్టుల్లో అతడి అత్యధిక స్కోరు 128 మాత్రమే.